పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/171

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: అష్టమదములలక్షణము :-
34. సీ. ఎక్కువకులమందు నేజనియించితి నాదు
కుల మెక్కు వనుటయుఁ గులమదంబు
సకలనిష్ఠాచారసంపంన్నుఁడను నేను
శ్రేష్ఠుఁడ ననుటయు శీలమదము
ద్రవ్యంబు నావద్ద దండిగా నున్నది
యని గర్వపడుటయు ధనమదంబు
ధరను నావంటి సుందరుఁడు లేఁడని నిక్కి
రూఢిగాఁ దిరుగుట రూపమదము
గీ. మదములన్నియు నీదేహమందు విడచి
భక్తినీమీద గలవాఁడు ముక్తుడగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

35. సీ. బలవంతుఁడ వయసుగలవాఁడ వైరుల
న్వధియింతు ననుట యౌవనమదంబు
సకలశాస్త్రంబులు చదివి వంచించిన
నధికుఁడ ననుట విద్యామదంబు
అఖిలదేశాధిపత్యము నాకు గలదని
రంజిల్లుచుండుట రాజ్యమదము
స్నానసంధ్యాద్యనుష్ఠానుండ నేనని
మదియుబ్బుటయుఁ దమోమదము సుమ్మి
గీ. యష్టమదముల నణఁచి ననిష్ఠపరుఁడు
పుణ్యపురుషుండు వైకుంఠపురము నుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.