పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/152

ఈ పుట ఆమోదించబడ్డది

128

భారత దేశమున

“ఏలినవారు సామంతరాజులకును గొప్పవా రందరికిని బహుమతు లంపవలెనని వ్రాయుచున్నారు. వారివారి దర్జాలకు తగిన బహుమానము లంపవలెనని తమ యభిప్రాయమైనచో మాకంపెనీవారిఆస్తియంతయు అమ్మిననుగూడా అది సాధ్యపడదని మనవి చేయుచున్నాను. ఏదో కొంచెము. లాభము సంపాదింపవలెనని మాకంపెనీవా రిన్ని బాధలు పడుచున్నారనియు, సాధారణముగా మాకు లాభము కన్న నష్టమే కలుగుచుండుననియు ఏలినవా రెరుగనిదికాదు. మాశక్తిని బట్టి చంద్రుని కొక నూలుపోగను నట్లు మేము సమర్పించు బహుమానములను శ్రీచక్రవర్తిగారును వారి సామంతులును స్వీకరింపవలెనని మా ప్రార్ధన.” ఇట్లు ఢిల్లీకంపబడిన “నూలుపోగు" బహుమానమున నారు ఏనుగులుండెను! ఈ లేఖ వ్రాయబడిన నెలలోనే కర్నాటక నవాబు మధుపాన మత్తతతో కంపెనీవారి స్వల్పబహుమతుల కతృప్తితో గొణుగుకొనుచు, తన సైన్యముతో మద్రాసు ప్రక్కనుండి పోయెను.

ఘాటుగల సారాయము లంపవలెనని యీ పై లేఖలో వివరింపబడి యుండుటలో నాశ్చర్య మావంతయులేదు. ఏలన 1709 లో వేయి సీమ సారాయ సీసాలంపవలెనని రాజుగారి దర్బారు నుండి దావూదుఖాను గవర్నరుకు లేఖవ్రాయగా 250 సీసాలంపబడెననియు, రెండు సీమకుక్కలనుగూడా పంపినట్లును మద్రాసురికార్డులలో గలదు. సారాయిబుడ్లు సమర్పించి మెప్పునందు పద్దతిక్రొత్తకాదు. అది జహంగీరు చక్రవర్తి నాటినుండియు జరుగుచునే యుండెను.