పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/2

ఈ పుట ఆమోదించబడ్డది

మొదటికూర్పు

పీఠిక

శ్రీ స్కాందపురాణాంతర్గతమగు నీబ్రహ్మోత్తరఖండమున శివమాహాత్మ్య‌ము, శివమంత్రమాహాత్మ్యము విభూతి, రుద్రాక్ష, సోమవారవ్రతరుద్రాధ్యాయాదుల మాహాత్మ్యములు వర్ణింపఁబడినవి. ఏతద్గ్రంథకర్త శ్రీధరమల్లె వేంకటరామకవి. ఇతఁడు బడగలనాటి కర్ణాటకుఁడు. అయ్యనార్యుని పుత్త్రుడు. భారద్వాజసగోత్రుఁడు. అశ్వలాయనసూత్రుఁడు. ఈగ్రంథము నీకవి శ్రీజ్యోతి రామమంత్రి శ్రీలక్ష్మీనారాయణ మంత్రుల ప్రేరణమున రచియించి అంబాపురమున నెలకొన్న పార్థివేశ్వరస్వామికిఁ గృతిగా సమర్పించెను. ఈయంబాపురము సిద్ధవటమునకుఁ బడమర నైదాఱుమైళ్లదూరమున నున్న పొన్నవోలు సమీపమునఁ బినాకినీతీరమున నున్నది. ఈసిద్ధవటము కడపజిల్లాలోనిది. కృతికారయితలును బడగలనాటికర్ణాటకులు పొన్నవోలు వాస్తవ్యులు.

ఈగ్రంథము శా. శ॥ 1737 - వ సంవత్సరమునకు సరియైన యువసంవత్సర కార్తికశుద్ధ పున్నమనాఁడు కృతి యీఁబడినట్టు గ్రంథాంతమునఁగల సీసపద్యమువలన స్పష్టమగుచున్నది.