పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/200

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

199

మాట్లాడ్డం నాకెంతో ఉత్సాహంగా ఉంది.

ఒక రోజున మా రాజు నా గదికి వచ్చి “రేపు ఈ వూళ్ళో ఒక దొరసాని స్థితిపరురాలు, పెద్ద ఇంటిది, విద్యావతి ఆమె మన దేశ స్థులంటే చాలా అభిమానంతో చూస్తుంది. ఆవిడ అప్పుడప్పుడు అనగా సంవత్సరానికి రెండుమూడుసార్లు మనవాళ్ళని కొందరిని ఇక్కడ వాళ్ళని కొందరినీ యువతీ యువకులను ఆహ్వానించి వాళ్ళకో చిన్న పార్టీ ఇస్తూంటుంది. అటువంటి పార్టీ ఒకటి రేపు ఏర్పాటు చేసింది. దానికి నిన్ను కూడా తీసుకురమ్మని వర్తమానం చేసింది. అందుకని మనం వెళ్ళుదాం. సిద్ధంగా వుండు” అన్నాడు రాజు. “పార్టీ అంటే అదేమన్నా మీటింగూ ఉపన్యాసాలూ ఇలాంటిదేమన్నానా లేక ఇంకేమన్నా ఉంటుందా? ఇక్కడ పద్ధతులేమిటో జరగబోయేదేమిటో ముందు తెలుసుకోవడం కోసం మిమ్మల్ని అడుగుతున్నాను” అన్నాను. “అబ్బే! సభా, ఉపన్యాసాలు అలాటి గొడవ ఏమీ ఉండదు. పది మందిని కలుసుకోడం, కులాసాగా కబుర్లు చెప్పుకోడం, టీ, ఫలహారాలూ సేవించటం. మళ్ళీ కాస్సేపు కబుర్లు చెప్పుకోడం ఎవరైనా పాడే వాళ్లుంటే పాటలు పాడడం, ఒక్కొక్కప్పుడు ఇన్ డోర్ గేమ్స్ అనగా, యింట్లోనే ఆడుకునే ఆటలేవన్నా వ్యవధి వుంటే ఆడుకోవడం. తరువాత ఎవరి దారిన వాళ్ళు చక్కా పోవడమున్నూ, యిదీ పద్ధతి యింతకంటే మరేమీ లేదు” అన్నాడు.

మన మామూలు డ్రెస్సూ పైన ఓవర్ కోటూ నెత్తిమీద హేటూ పెట్టుకొని బయలుదేరి అక్కడికి వెళ్ళడం. అక్కడ వీధి తలుపుకు అమర్చి ఉన్న ఒక గొలుసు లాంటిది లాగితే లోపల గంట మోగుతుంది. అప్పుడు ఆ యింటి బట్లరు వచ్చి తలుపు తీస్తాడు. తలుపు తీయగానే మన్ని “గుడ్ ఆఫ్టర్ నూన్ సర్” అని మన ఓవరుకోటూ, టోపీ తీసుకుని భద్రపరుస్తాడు. మనల్ని లోపలిహాల్లోకి తీసుకువెడతాడు. అక్కడ యజమానురాలు వచ్చి మనల్ని పలకరించి కరచాలనానికి చెయ్యి అందిస్తూ “హౌ డూయూడూ” అంటుంది. అంటే కులాసాగా ఉన్నావా అన్నమాట. తరువాత మనల్ని తీసుకెళ్ళి అక్కడ వున్న వాళ్ళందరకూ పరిచయం చేస్తుంది. ఆతరువాత కార్యక్రమం యిందాకనే చెప్పినట్లుగానే కబుర్లతో ప్రారంభమవుతుంది - అన్నాడు. సరే యిక్కడ వేడుకచూద్ద మని అలాగే వస్తాననీ “నీవు కూడా ఉంటావు కదా నాకు సందేహం, భయం ఏముంటుంది?” అన్నాను. “నేను వచ్చి నిన్ను తీసుకునే వెడతాననుకో, ఏ కారణం చేతనైనా నేను రాలేకపోతే వెళ్ళవలసినచోటు