పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/197

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

బారిష్టరు పార్వతీశం

చేస్తోంటే నేను నెయ్యి కాచేను. వంటంతా అయిన తరువాత ఆవిడ అన్నీ తీసుకువచ్చి నా గదిలో అమర్చి వెళ్ళిపోతుంటే ఆవిడను వెనక్కు పిలిచి కొంచెం ఆవపిండి ఒకచిన్న ప్లేటులో పెట్టి “ఇది మాదేశంలో ప్రసిద్ధ మైన ఊరగాయ. మీరు రొట్టెమీద బాగా వెన్నరాచి దాని పైన జాంలాగా రాసుకు చూడండి. కొంచెం కారంగా వున్నా చాల బాగుంటుంది. అట్టే వుపయోగించకండి అని హెచ్చరిక చేశాను కూడాను. ఆవిడ సంతోషించి తీసుకు వెళ్ళింది.”

ఆ పూట భోజనం హాయిగా మన పద్ధతిని చేద్దామనిపించింది. ఈ చెంచాలు, కత్తులూ, పోర్కులుతోటి మన భోజనం చేయడానికి అట్టే వీలుగా వుండడంలేదు. అందుకని ఒక పూటన్నా మన పవిత్ర భారతదేశాన్ని తలచుకొని, మన ఆచారము అనుసరణీయమని నిశ్చయం చేసుకొని స్పూన్లు, పోర్కులు వగైరా పక్కకు పెట్టేసి సుఖంగా చేత్తో కలుపుకొని భోజనం ప్రారంభించాను. పప్పు అన్నం తినడమైంది. రెండో వాయి ఆవకాయ కలుపుతుండగా అవతలనుంచి కెవ్వున కేక వినబడింది. ఏమిటో అను కుంటూంటే “ఓ మిష్టర్ సేం”, అని పిలుపు వినబడ్డది. ఏం కొంప మునిగిందా అనుకొని కలిపిన ముద్ద నోట్లో పెట్టుకొని లేద్దామను కుంటూంటే ఒక్క ఊపులో “ఓ సేం”, అంటూ ఏడుస్తూ ఇంటావిడా, ఆవిడ వెనకనే ఆవిడ కూతుళ్ళూ గదిలో చొరబడ్డారు. “ఏమిటమ్మా! ఏం జరిగింది” అన్నాను. ఆవిడ ఏదో చెబుదామనుకుంటూ నాకంచం కేసి చూసింది. ఆవిడ సమాధానం కోసం నిరీక్షిస్తూ నేను కలుపుకున్న ఆవకాయ చేయి నాకుతున్నాను. ఆవిడ అదివరకు పడ్డ బాధేమిటో తెలియదుకాని ఇప్పుడు మటుకు నాచెయ్యి చూసి ఓ, ఓ, ఓ, అని ఓ వెర్రి కేక వేసి, వెనక్కు విరుచుకొని మూర్ఛ వచ్చినట్లు కుర్చీలో కూలబడ్డది. అంత వరకూ నన్ను చూచీ ఇకిలిస్తూ సకిలిస్తూ వున్న కూతళ్ళిద్దరూ ఆ వుద్యమం మానుకుని, రెండు కన్నీటి చుక్కలు బలవంతాన తెచ్చుకొని, తల్లీ సంరక్షణ కోసం ఆవిడ దగ్గరజేరి, ఒకరు మంచినీళ్ళందించి ఒకరు ఆవిడ ముఖంమీద కాసిని నీళ్లు చిలకరించారు. ఆవిడ నెమ్మదిగా కళ్లు తెరచి నాకేసి వేలుతో చూపిస్తూ వెక్కిళ్ళతో “సేం, సేం యూ” అంటూ మళ్ళీ మూర్ఛ పోవడానికి వుద్యుక్తురాలవుతుంటే, నేను కూడా ఆవిడ దగ్గర కెళ్ళి “ఫరవాలేదండి, మీరెందుకు అలా కంగారు పడ్డారు. మీకేం భయం లేదు. అసలేం జరిగిందో చెప్పండి” అంటూ మెల్లగా అనునయిస్తూ ఆవకాయ కలుపుకున్నా నన్న మాట మరచి ఆ చేత్తోటే ఆవిడ కళ్లు తుడిచాను. యింకేముంది మళ్ళీ కొంపలంటుకున్నంత పని జరిగింది.