పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/435

ఈ పుట ఆమోదించబడ్డది

228

బసవపురాణము

భక్తమహత్త్వంబు భక్తాభివృద్ధి - భక్తచరిత్ర ప్రభావవైభవము
కన్నవారలు సెప్ప విన్నవారలును - నున్నతశివభక్తి యుక్తిమైఁదగిలి
దేవలకులు మంత్రదీక్షాన్వితులును - శైవపాశుపతాదిశాసనధరులు
వారివారిక లింగవంతులై చూచి - వారివారిక లింగవంతులై కూడి
వీరమాహేశ్వరాచార నిరూఢి - భూరిప్రసాదోప భోగులై నడవ

బోయలతగవు


బోయ లందఱుఁగూడి భూమీశుకడకుఁ - బోయి "యుత్పాతముల్వుట్టె నీపురిని
శ్రీకంఠశివులు గౌరీనాథశివులు - లోకేశశివులు ద్రిలోచనశివులు
నీశానశివులు మహేశ్వరశివులు - పాశమోచనశివు ల్వరమాత్మశివులు
శాశ్వతశివులు గణేశ్వరశివులు - విశ్వేశ్వరశివులును విమలాత్మశివులు
త్రిపురాంతకశివులు ద్రినయనశివులు - ద్విపదైత్యహరిశివు ల్దేవేశశివులు
నురులింగశివులును నుగ్రాక్షశివులు - హరశివులును బరమానంద శివులు
ధర్మశివులును విద్యాధరశివులు - నిర్మలశివులును నిష్కలశివులు
మొదలుగాఁగల శైవముఖ్యు లందఱును - నిదియేమి మతములో యెఱుఁగంగ రాదు
బసవయ్యతోయంపు భక్తులఁజూచి - వసుధఁదారును లింగవంతుల మనుచుఁ
దొడఁగి ప్రసాదంబుఁగుడుచుచున్నారు - నడరఁగ మా కించు కైనను నిడరు
నియ్యూరిలో మల్లజియ్యయు బొల్ల - జియ్యయు నిత్తురే చెల్లునే యిట్లు
విను మహారాజ మావృత్తి నిర్మాల్య - మొనరఁగ మాకు వచ్చినతొంటి విధము
పనులఁగావఁగఁబోయి బాలుఁడు దొల్లి - యిసుకలింగముసేసి యెలమిఁబైఁబిదుక
నేలరా మొదవుల పాలెల్ల నేల - పాలు సేసెద వంచుఁగాలఁదన్నుడును
గఁడగి తండ్రియనక గ్రక్కునఁగాళ్లు - గడికండలుగఁజేసి మృడుని మెప్పించి
మా దేవుచేతఁబ్రసాదంబు వడసి - యాదిఁ జండేశ్వరుఁడట్ల మాకిచ్చె
నంతటనుండి భోగింతు మిట్టులు ని - రంతరవంశ పరంపర మేము
నిప్పురి వీరమాహేశ్వరు లనఁగ - నిప్పు డేలా చెల్ల నిచ్చెద మనుచు
బసవయ్య యంత్రము ల్వన్నుటఁజేసి - పొసపరి మాతోడఁబోరుచున్నారు
చెల్లింపఁదగు నని చెప్పుగాదేని - వల్లభ నీ యింటి వాకిట నగ్ని
గుండముల్ ద్రవ్వించికొని కాల్దు” మనిన - నిండుఁగోపముతోడ నిఖిలేశ్వరుండు
బసవయ్యఁ దోడ్తేరఁ బనుచుడు బసవఁ - డసమానలీలమై నరుగుదెంచుడును
“గెడ గూడి బోయలఁగెడపుటిదేమి - వడిఁబ్రసాదము మీరు గుడుచుటిదేమి