పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/258

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

51

సతతంబు గురులింగ[1]చరణములయందు - నతిముదమున నుండు నాదిబసవఁడు
అట్టొట కి[2]టుసూడుమా” యని శంభుఁ - డిట్టలంబుగఁ దన హృదయంబుఁ దెఱవ
సంగతంబగు కరస్థలము లింగంబు - జంగమావళికిని శరణనుకరము
ననిమిషుఁడై చూచు హరుమీఁది దృష్టి - గనుఁగ హర్షాశ్రుకణవితానంబు
దరహసితాస్యవిస్ఫురణయుఁ దనరఁ - బరమశివధ్యానపారవశ్యమునఁ
బద్మాసనస్థుఁడై పరమేశు హృదయ - పద్మంబునం దున్నబసవనిఁ జూచి
ప్రమథులు హర్షింప నమరులు మ్రొక్క - నుమబోటి యత్యద్భుతోపేత గాఁగ
నా మూర్తిఁ గని సిద్ధరామయ్య యుద్గ - తామితానందపూర్ణాత్ముఁడై [3]తనర
హరుఁడు పర్వతపుత్త్ర నరవిరికంటఁ - బొరిఁ బొరిఁ జూచుచుఁ బూర్ణేందువదన!

శివుఁడు పార్వతికి బసవని మహిమ తెలుపుట


చూచితే బసవనిసురుచిరమహిమ - యీ చెల్వునిల్కడ యేరికిఁ గలదె?
వెలయఁగ నయ్యాదివృషభేంద్రుఁ డనఁగ - నలి నేన రెండుమూర్తులు ధరించితిని
విను "తవపుత్త్రోభవిష్యామి” యనుచు - నెనయ శిలాదున కేన పుట్టితిని
అసలార భక్తహితార్ధమై యేన వసుధ జనించితి [4]బసవం డనంగ
నెసఁగ నిట్టిద[5]కాన యీశుండ నేన - బసవఁడన్ పేరి సద్భక్తుండ నేన
మున్నును మన బసవన్న సద్గుణ మ - హోన్నతి యెఱుఁగవే యొగి నట్లుఁగాక
లోకాధిపతి నేను లోలాయతాక్షి! - ప్రాకటంబుగ లోకపావనుఁ డితఁడు
కారణలోకసంహారుండ నేను - కారణలోకోపకారి యితండు
భక్తవత్సలుఁడ నేఁ బర్వతపుత్త్రి! - భక్తరత్నములకు బండారి యితఁడు
భక్తైకదేహుండ భావింప నేను - భక్తజనప్రాణి బసవఁ డీక్షింప
ముక్తికి రాజఁజూ ముద్దియ నేను - భక్తికి రాజుసూ [6]బసవఁ డీక్షింపఁ
[7]బసరింప నే లింగపట్టబద్ధుండ - బసవండు సద్భక్తిపట్టబద్ధుండ
అచరలింగంబ నే నచలేంద్రతనయ! - సచరాచరక్షోణిఁ జరలింగ మితఁడు
సనునాది నా పేరు [8]శంభుం డనంగఁ - బొనర ద్వితీయశంభుఁడు వీనిపేరు
స్థిరభక్తి మమ్ముఁ గొల్చినఁగాని లేదు - ధర వీనిఁ దలఁచినంతనె [9]ముక్తి గలదు.
అలరుచుఁ బ్రాణదేహార్థముల్ నాకు - నిల నిత్తు రఖిలభక్తులు నొక్క యెడను

  1. చరణంబులందు, జంగమంబందు
  2. కిదె
  3. యుండ
  4. బసవేశుఁ డనఁగ
  5. కాక
  6. బసవండు తలఁపఁ
  7. బ్రసరింప
  8. శంభుండనాఁగఁ శంభుండునాఁగఁ
  9. కల్గు భక్తి