పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/152

ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

117


యతికి లక్ష్యముగా నాచన సోముని వసంతవిలాసములోనిదిగా నీ క్రింది పద్యము నుదాహరించినాఁడు.

క. అత్తఱి విటనాగరకులు
    చిత్తమున వసంతకేళి సిగురొత్తంగా
    మొత్తములు గట్టితెచ్చిరి
    ముత్తెపుఝల్లరులతోడి బుఱ్ఱటకొమ్ముల్.

ఈ పద్యమందలి 'బుఱ్ఱటకొమ్ముల్' అను పదమును ప్రాచీనకవులు 'ముఱ్ఱటకొమ్ముల్' అనియే వాకొనిరి. కుమారసంభవమునఁ బెక్కుచోట్ల నన్నిచోడకవి యట్లే ప్రయోగించెను. రామాయణమం దయ్యలార్యుఁ డట్లే ప్రయోగించెను. 'ముఱ్ఱటకొమ్ములు' బుఱ్ఱటకొమ్ములుగా మాఱిన పిదప లాక్షణికు లీ ముకారయతిని గల్పించిరి. దానిఁబట్టి యర్వాచీనకవు లా యతిని ప్రయోగించుచు వచ్చిరి. 'ముస్సు' ధ్వన్యనుకరణమైనట్టే ముఱ్ఱటకొమ్ములో 'ముఱ్ఱు' కూడ ధ్వన్యనుకరణమగునని నా తలఁపు. ప్రాచీనకాలమున 'ముస్సు' 'ముఱ్ఱు' అని యున్న ధ్వన్యనుకరణము లర్వాచీనకాలమున 'బుస్సు' 'బుఱ్ఱు' లుగా మాఱియుండవచ్చును.

నన్నయాదులు విభక్తిముకారముతో 'పుఫుబుభు' లకును యతిని గూర్చిరి. కాని, యితర ముకారముతోఁ గూర్పరయిరి. లాక్షణికులు దానికి ము విభక్తికయతి యని పేరిడిరి. “పుణ్యుఁడు రాఘవుండు వనముం గనియెన్” అను విధమునఁ బ్రయోగించిరిగాని 'పుణ్యుఁడు రాఘవుండు మునిముఖ్యులతో' నను విధమునఁ బ్రయోగింపరయిరి. సమానోచ్చారణముగల 'ము' కారముల కిట్లు యతిలో భేదము గల్పించుట నేఁడు వింతగా గాన్పించును గాని యాంధ్రమున నట్టి యతివ్యవస్థ యేర్పడిన కాలమున నీ విభక్తి ముకారము వేఱువిధముగా నుండెడిది. నేఁడును విభక్తిముకారమునకు 'మ్ము, Oబు' అని రూపాంతరము లున్నవి. వనము, వనమ్ము, వనంబు అనియు రూపములు గలవు. నన్నయకుఁ