పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/128

ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

93


యుండిరనియుఁ, గొందఱు వైదికధర్మముతో లింగధారణమును గూడఁ నాంధ్రదేశమందుఁ బాటించుచుండి రనియు నందుఁగలదు. ఇది వాస్తవమేమో పరిశోధింపవలసియున్నది. ప్రాచీనాంధ్రారాధ్యసంప్రదాయగ్రంథములలో లింగధారణాదివిషయములు గానరాకుండుట చేతను, నాంధ్రారాధ్యులలో నిప్పటికిఁ గొన్ని కుటుంబములవారు లింగధారణము లేకయే యుండుటచేతను మీఁదివిషయము విశ్వాస్యమే యగునని నేఁ దలంచుచున్నాఁడను.

క్రీ.శ.1350 నుండి 1450 దాఁక సుప్రఖ్యాతులుగానున్న కొండవీటిరెడ్లు, తన్మంత్రులు శైవమతాభినివిష్టులుగా నుండిరి. వారికిని వారి మంత్రి యగు మామిడి ప్రెగ్గడయ్యకును శంకరారాధ్యులను వారు గురువులుగా నుండిరి. ఆ శంకరారాధ్యులకే పెదకోమటి వేమారెడ్డి పినపాడను గ్రామము నగ్రహారముగా నొసఁగెను. దానికి శాసనము గలదు. తెనాలిదగ్గఱఁ బినపాటిలో నేఁడా శంకరారాధ్యులవారి వంశమువారు మృత్యుంజయారాధ్యులు గలరు. వీరిది యుద్భటారాధ్య వంశమట! కాని, వీరికి లింగధారణము లేదు. బహుకాలమున నుండి సుప్రఖ్యాతమయియున్న యీ వంశమువారు లింగధారులు గాకుండుట వింతగాదా! మఱియు నాంధ్రదేశపుటారాధ్యుల కుటుంబములలో మిక్కిలి గౌరవము గడించినవారు లింగధారణము లేని వారింకను గొందఱు గలరు. గోదావరీ మండలమున నయ్యగారివారని యారాధ్యులు గలరు. [1]వారికిని లింగధారణములేదు. ఉద్బటుఁడు భోజునకు దీక్షాగురువని పండితారాధ్యచరిత్రమునను, నుద్భటచరిత్రమునను గలదు. భోజుఁడు రచించిన శైవతంత్రము తత్త్వప్రకాశము నేఁడు సుముద్రితమై యున్నది. అందు నేఁటి యారాధ్యసంప్రదాయవిషయము లేవియుఁ గానరావు. గోళకీమఠసంప్రదాయమువారు తమ గ్రంథములందు భోజుని గ్రంథములను బ్రమాణముగాఁ గొనియున్నారు.

  1. వీరార్వేలనియోగులు గాని యారాధ్యులు గారని కొందఱనుచున్నారు. “కూచిమంచి తిమ్మకవ్యాదుల గురువైన దెందులూరి లింగనారాధ్యుని శిష్యులందఱు 'అయ్యగారు అనుటచే నాయన తర్వాతి వారయ్యగారివారైనారు” అని బ్రహ్మశ్రీ నడకుదుటి వీరరాజుపంతులుగారు వ్రాసిరి. రక్తాక్షిచైత్ర భారతి చూడుఁడు.