పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/64

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

తనహృదయంబు వెంబడిన తప్పక ఘోటక మంతనంతనే
పనుపడ నిల్చి ముందఱకుఁ బాఱి కెలంకులకుం దొలంగి దా
వెనుకకు నేఁగుదెంచి కడువేడ్క యొనర్పఁగ బంతియాడ నే
మ్మిని గనకంపుఁగోల నడిమింటనె త్రిమ్మరఁదారి కొట్టుచున్.

29


వ.

మఱియును.

30


చ.

ఎగురఁగ వైచి కొట్టు టది యెంతభరం బని బంతి యగ్రగా
మిగ వడిఁ బాఱవైచి పుడమిం బడనీకయె దాని మీఱి చి
త్రగతి హయంబుఁ దోలుచును గ్రమ్మఱ మీఁదికిఁ గొట్టియాడె విం
తగఁ దనచేతిరత్నమయదండము కాంతులు గాడి పాఱఁగన్.

31


వ.

వెండియు నతండు మండలగతుల నతులంబుగాఁ దురంగంబుఁ
డోలి యాడె నప్పుడు.

32


సీ.

తొలుదొల్త నయ్యేకతురగంబు మండల
            గతిచారి యగుచు నిక్కంబు తోఁచె
నావెనుకను సరూపాశ్వాలి చెదరక
            చక్రాకృతిని బర్వుసరణి తోఁచె
నంతట ననతిస్ఫుటావయవంబుగా
            నెనసి యేకాంగవేష్టనత తోఁచెఁ
దుదఁ దద్విభూషణద్యుతిరాజిమాత్రంబు
            కొఱవి త్రిప్పినరీతి మెఱసి తోఁచె


తే.

అంతకంతకు గతివేగ మగ్గలింప
రాఁగ వాగె యెచ్చరిక పరాకు జియ్య
యనుజనులు ఱిచ్చవడి తమపని మఱవఁగఁ
బరఁగునమ్మేటినెఱరౌతు ప్రౌఢికతన.

33