పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యనుశంకఁ జేసి హంసాం
గన యేకాంతంపుమాట గల దని పల్కెన్.

18


క.

పలికినఁ గమలావిభుఁ డా
పులుఁగుపడఁతిమాటనేర్పు బుద్ధికళాకౌ
శలమును మెచ్చుచు నెంతయు
మొలకనగవు చెక్కుటద్దములఁ దళుకొత్తన్.

19


చ.

చెలువుగ భోజకన్యతొడఁ జేర్చినమూర్ధము సత్యభామయూ
రులపయి నున్నపాదములుఁ బ్రోర్జితలీలఁ దరల్చి లేచి యు
జ్జ్వలనిజపాణిపద్మమున జాంబవతీకరనాగవల్లికా
దళములు పుచ్చుకొన్నఁ బ్రమద ల్చనిరందఱుఁ గొంతదవ్వుగన్.

20


తే.

ఇట్లు గోవిందుఁ డేకాంత మిచ్చి వినఁగ
హంసి తము వజ్రి పిలిపించు టాది గాఁగ
నచట కనుచుట తుద గాఁగ నతనితమవ
చఃప్రసంగంబు నిరవశేషముగఁ జెప్పె.

21


వ.

ఇట్లు చెప్పిన.

22


చ.

వడుగులప ల్కుపశ్రుతిగ వారక మున్ను సునిశ్చితత్వమున్
బడసిన కార్యపద్ధతికిఁ బక్షివధూవచనక్రమంబుచేఁ
గడమ సమర్పితం బగుడుఁ గంజదళాక్షుఁడు సంతసిల్లె నే
ర్పడియెను వజ్రనాభవధభారవహుం డిపు డంచు నాత్మలోన్.

23


వ.

ఇట్లు సంతసిల్లి శుచిముఖి కిట్లనియె.

24


చ.

బలవిభవాభిశోభితుఁ డభంగురశౌర్యధురంధరుండు కా
వలసినమాయలు న్దివిజవైరులకంటెఁ గరంబు నేర్చు నీ
పలుకులచంద మారయఁ బ్రభావతికిం బతిగాఁ గలాఁడు ని
చ్చలముగ రుక్మిణీసుతుఁడు చంపు నవశ్యము వజ్రనాభునిన్.

25