పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సంగు లనాదిదంపతులు సత్కృప నిత్తురుగాక సౌఖ్యముల్
పింగళిసూరధీరవరుబిడ్డకు మాయమరేశమంత్రికిన్.

2


చ.

అమలనవీనహైమనిజయానగరుద్ద్యుతిఁ బ్రోచుసద్విపు
ర్విమలరుచిన్ స్వభక్తులకు వెండియుఁ బైఁడియుఁ గీర్తియు న్సుతే
జము నెపుడప్పుడే యొసఁగు సర్గనిధానముఁ దాల్చియున్నయ
ట్లమరెడువాగ్విధాత లమరార్యున కిత్తురు నిత్యసౌఖ్యముల్.

3


వ.

అని సకలభువనప్రవర్తనహేతువు లైనపురాతనమిథునం
బులం గొనియాడి.

4


తే.

ఆదికవులఁ బ్రాచేతసవ్యాసమునులఁ
దలఁపులోన భజించి యత్యంతసరస
మగు ప్రభావతీప్రద్యుమ్న మనుప్రబంధ
మాచరింపుచు నొక్కనాఁ డాత్మలోన.

5


మ.

జనము ల్మెచ్చఁగ ము న్రచించితి నుదంచద్వైఖరిం గారుడం
బును శ్రీరాఘవపాండవీయముఁ గళాపూర్ణోదయంబు న్మఱి
న్దెనుఁగుంగబ్బము లెన్నియేనియును మత్పిత్రాదివంశాభివ
ర్ణనలేమిం బరితుష్టి నా కవి యొనర్పంజాల వత్యంతమున్.

6


క.

తండ్రియు సుతులకు దైవం
బండ్రు గదా వేదవాదు లది వినియును నే
వీండ్రును వాండ్రును బలె మా
తండ్రిఁ బరమపూజ్యుఁ గాఁగఁ దలఁపమి తగునే.

7


మ.

గయలోఁ గాశిఁ బ్రయాగ శ్రీగిరిని గంగాద్వారనీలాచలో
జ్జయనీద్వారకలం దయోధ్యమథురన్ సంస్తుత్యపుణ్యస్థలా
గ్రియత న్వెండియు మించునైమిశకురుక్షేత్రాదులం దర్పణ
క్రియచే నాపినతమ్ముఁ డెఱ్ఱన యొనర్చెం దండ్రి కాహ్లాదమున్.

8