పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/102

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కావున నోహంసి నీ వెఱుంగనిసఖీ
            ధర్మంబు లేదు విద్వజ్జనంబు
సఖ్యంబు నెంచును సాప్తపదీనంబు
            గాఁగ నట్లౌట వేగంబ యరిగి
యదుకుమారకునకు హృదయంగమముగ నీ
            యతివసౌందర్యాదు లభినుతించి
యేతన్మనోరథం బీడేర్పవలయు నీ
            వని పల్కుటయును నాహంసరమణి


తే.

యతనియొద్ద నీయంగనయంగకముల
చక్కఁదన మెల్ల నొక్కప్రసంగవశత
నేను మున్న వర్ణించినదానఁ దత్ప్ర
సంగ మెయ్యది యంటేని సకియ వినుము.

89


ఉ.

ఏ నిట మున్ను నివ్వనరుహేక్షణఁ గన్గొని చన్నదాననై
యానరవర్యుఁ గాంచి యరుదైనతదాకృతిశోభ కెన్న జో
డైనది యావిలాసవతియాకృతిచెల్వమ కావునం దలం
పైన వచింపఁగా వలసె నాతనియొద్దఁ బ్రసక్తి వెంబడిన్.

90


క.

వచియించిన నౌఁ గా దను
వచనం బపు డేమియు నుడువకయుండె నతం
డచలస్థితి నాకును నది
య చాలు నప్పటికి నేతదర్థ మెఱుఁగమిన్.

91


క.

అన విని మనసు చివుక్కురు
మనఁగఁ బ్రభావతి వివర్ణ మగువదనముతోఁ
గనుపట్టుడు నింతనె ముగి
సెనె కార్యం బేల యింత చింతిల ననుచున్.

92