పుట:ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము.pdf/9

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉలూఖలబంధలక్షణము

చ.

భ్రమపడఁబోకుఁడీ డమరుబంధ ములూఖలబంధ మొక్కచం
దమునఁ దనర్చునంచు నభిధానము వర్ణవిధానముం బ్రధా
నముగఁ బ్రధానిధానములు నవ్యకవీశ్వరకావ్యసంవిధా
నము విధిసన్నిధానసృజనప్రణిధానము చింత లెంతయున్

26

ముసలబంధకుంతబంధలక్షణములు

చ.

ముసలమునందు మధ్యపదముల్ కొసబంతులు రెండు కుంతమం
దు సరిగ నాల్గు ప్రాథమికతుర్యపదంబు లితస్తతోగతిం
బొసఁగును రెంటిదంటులను బుద్ధికొలందిఁ జమత్కరించి యీ
పస నెసఁగించినన్ ముసలబంధ మగుం దగుఁ గుంతబంధమున్

27

అంకుశబంధలక్షణము

శా.

కాండాదిప్రసవంబునందును దదగ్రంబందుఁ బూర్వాంఘ్రియుం
గాండాగ్రాక్షర మాద్యమంత్యముగ ఖడ్గంబందు వక్రాసియం
దండన్ రెండును దుర్యమాదిపదమందగ్రాదియై క్రిందుగాఁ
గాండంబందును బొందు నంకుశపదాంకంబైన బంధంబునన్

28

పతాకాబంధలక్షణము

శా.

స్తంభాకారమునందుఁ బ్రాక్చరణముం దత్రత్యవర్ణంబు లా
రంభంబంతము నౌనటుల్ ధ్వజపటాగ్రం బట్ల యౌనట్లు త
చ్ఛుంభత్పార్శ్వములందు మధ్యపదముల్ శ్లోకాంత మాద్యాంఘ్రిగా
గంభీరాశయు లి ట్లొనర్తురు పతాకాబంధ మందంబుగాన్

29

హలబంధలక్షణము

మ.

హలకాండంబు యుగంబు సంధిలినచో నారబ్ధమై దాని నే
వలగొంచున్ హలమధ్యమందుఁ బ్రథమంబౌ నంఘ్రి మధ్యాంఘ్రు లా
హలసంధ్యక్షర మాద్యమంత్యముగ నర్ధావృత్తినం దేకనుం
దలక్రిందై ప్రథమాంఘ్రి నొందు హలబంధంబందుఁ దుర్యాంఘ్రియున్

30

దర్పణబంధలక్షణము

ఉ.

స్వర్పతిదేశికార్యులగు సత్కవివర్యులు కార్యధుర్యులై
నేర్పుఁ దలిర్ప వేర్పఱచి నీరజకోశనికాశరేఖలన్
దర్పణరూప మేర్పఱచి దర్పకదర్పహృదర్పణంబు దృ
క్తర్పణముం బొనర్ప నది దర్పణబంధ మగున్ వసున్ధరన్

31

కంకతికా(దువ్వెన)బంధలక్షణము

మ.

కృతికర్తల్ కుతుకం బెలర్పఁ దొలుతన్ రేఖాకృతిం దీర్చి మ
ధ్యతలహ్రస్వము పర్యధఃక్రమ విశాలాగ్రంబునౌ దానిలో
నతిచిత్రంబుగఁ బంచపత్రముల నాద్యంతాంఘ్రులం గూర్చి కం
కతికాబంధ మొనర్తురు న్నవిరుప్రక్కల్ ద్రొక్కి సంధిం జొరన్

32

యోగదండబంధలక్షణము

ఉ.

ఇంచుక నిమ్న మంచుల నొకించుక నమ్రమునైన మౌళిచే
మించిన యోగదండమున మీదుగఁ గ్రిందుగఁ బల్క నర్హతం
గాంచుఁ గవాంఘ్రు లున్నవి సగమ్మునఁ గ్రమ్మరివచ్చు నీగతిం
బంచిన యోగదండమను బంధ మగున్ రచనాచమత్కృతిన్

33