పుట:ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుంచికాబంధలక్షణము

ఉ.

బంధురనాళమందుఁ దొలిపాదము వ్రాసి తదగ్రవర్ణమే
సంధిగ మధ్యపాదములు చక్రమునం దిడ నంత్యమాద్యమై
సంధిలుఁ బ్రాతిలోమ్యగతిసంగతి నీగిత మించుఁ గుంచికా
బంధము గ్రాంథికుల్ దమప్రబంధములం బచరింత్రు వింతగాన్

87

ద్వాత్రింశద్దళపద్మబంధలక్షణము

శా.

పత్రంబుల్ పదియాఱులోపలఁ బయిం బత్రంబు లామాత్రమే
పాత్రం బౌనటు వ్రాసి సీసము లిఖింపం గేసరాగ్రంబులం
బత్రాగ్రంబులనున్న వర్ణములచేఁ బద్యాంతరంబౌ నిదే
ద్వాత్రింశద్దళపద్మబంధము బ్రబంధశ్రీకి సద్మం బగున్

88

సింహాసనబంధలక్షణము

చ.

జలధికరేందుహస్తయుగసద్మము లేర్పడునట్లు నేర్పునం
జెలువగు రేఖలం గలిపి సింగపుగద్దియ దిద్దితీర్చిన
ట్లరిచి బల్విచిత్రగతి నంఘ్రులు నాల్గును బూని దానిలో
పల నిమిడింపఁగా నదియ భాసిలుఁ గేసరిపీఠబంధమై

89

దీపబంధలక్షణము

శా.

దుర్ధ్వాంక్షక్రమరారటత్కుకవిసందోహస్మయాగాంబుద
ద్వార్ధ్వానప్రపత్స్వరూక్తిసుకవివ్యక్తీకృతాకారమై
యూర్ధ్వాథఃపఠనీయరీతిఁ జరణవ్యూహంబు నెక్కొల్ప నం
తర్ధ్వంతక్షపణక్షమం బగుచు నుద్యద్దీపబంధం బగున్

90

వల్మీకబంధలక్షణము

మ.

శిరముల్ నాల్గు క్రమోన్నతంబులగు వాసిన్ వ్రాసి యైదేసి మం
దిరముల్ గల్గునటుల్ ఘటించి ప్రతిపఙ్క్తిం బద్యపాదంబుల
క్షరవిన్యాసచమత్క్రియాస్పదముగా సంధింపఁగా వచ్చు న
వ్వరుసల్ పెంచినఁ బెంచవచ్చు నదియే వల్మీకబంధం బగున్

91

లఘునాగబంధలక్షణము

చ.

కుసుమశరార్చిచేఁ బెనచికొన్న సమున్నతపన్నగంబుల
ట్లసదృశరేఖల న్నెరపి యందలిసంధులనున్న వర్ణముల్
కొసదనుక న్సమంబులుగఁ గూర్చి విచిత్రగతిన్ లిఖింపఁగా
రసికజనాద్భుతం బగుచుఁ గ్రాలు నదే లఘునాగబంధమై

92

యాత్రికబంధలక్షణము

ఉ.

కాశికిఁ బోయి గంగఁ గొని కావడియం దిడివచ్చువానిరూ
పాశయ మొప్ప వ్రాసి యట నంఘ్రులనంఘ్రులు రెండు కంధరా
దేశగవర్ణమాదిని మదిం దగురీతిగ మధ్యమాంఘ్రులుం
గౌశల మొప్పఁ గావడిని గల్పఁగ యాత్రికబంధమై తగున్

93

ద్విశరచాపబంధలక్షణము

చ.

చతురత రెండురోపముల చాపము రూపము వ్రాసి తచ్ఛర
ద్వితయమునందుఁ బ్రాక్చరమవృత్తపదద్వితయంబు సంధిసం
గతలిపు లాదులుందుదలుగా గుణచాపములం దదన్యముల్
జతగ లిఖింపఁగా ద్విశరచాపసమాహ్వయబంధమై తగున్

94