పుట:ప్రబంధరత్నాకరము.pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

సీ.

శ్రీ కరనవపుండరీకసంపదలకుఁ
              గవయైన నేత్రయుగ్మంబుతోడ
[శంఖశార్జ్ఞ]స్ఫురచ్చక్రగదాశోభి
              తములైన హస్తపద్మములతోడఁ
నూర్జితమకుటకేయూరకౌస్తుభచారు
              రమణీయమణిభూషణములతోడఁ
బదియాఱువన్నెల పస మించు తళుకుల
              వలనైన పసిఁడి దువ్వలువతోడ


తే.

నిరతమును గూర్మి [మీఱి] పేరురమునందుఁ
గాపురంబున్న దుగ్ధాబ్ధికన్యతోడ
శ్రీ జగన్నాథుఁ డెలమి నాశ్రితనిధాన
మర్థిఁ గల నాకుఁ బ్రత్యక్షమైనఁ జూచి.

1


సీ.

నీలాచలాగ్రసన్నిహిత[నిత్య]నివాస!
              వాసవార్చితదివ్య వస్తునిరత!
[1]శతగోపకన్యకాచతురతాతత్పర!
              పరతత్త్వవాసనాప్రకటస్వాంత!
సారసోద్భవనుత! శయనపారావార!
              వారణోద్ధరదయావరవిశేష!
శేషాహితల్పసుస్థిరస[చ్చి]దానంద!
              నందవ్రజస్ఫుటోన్నతవిహార!


తే.

హారకేయూరమకుటమంజీరవిసర
సరసభూషణభూషితస్ఫారరుచిర!
చిరదయాలోల! రక్షణస్నేహవిజయ!
జయజగన్నాథ! దేవతాసార్వభౌమ!

2


తే.

అనుచు వినుతించు నాదు నెమ్మనము సెలఁగ
ననఘుఁ డాద్యుండు పురుషోత్తమాఖ్యపురపు
శ్రీ జగన్నాయకుఁడు సమాశ్రితనిధాన
మాదరంబున నిట్లని యానతిచ్చె.

3


ఉ.

అరయ రామప్రెగ్గడకులాగ్రణి గంగయమంత్రిజగ్గ! నా
పేరిటివాఁడ వెప్పుడును బ్రేమ ఘనంబగు మాకు నీపయిన్
గౌరవలీల నీవు సమకట్టిన మేలిమి కావ్యసార మిం
పారఁగ మత్సమర్పణము శాశ్వతకీర్తిఁగఁ జేయు నావుఁడున్.

4
  1. ట. రత