చ. |
సరసిజనాభుఁ డట్టె హరి సారససంభవుఁ డట్టె బ్రహ్మ యా
సిరియును నబ్జవాస యటె చిత్తమునం దలపోసి చూడఁగా
దొరమునె యీప్రసూనములతో నితర[1]ప్రసవవ్రజంబు నాఁ
బురమునఁ బద్మషండములు పొల్పెసలారు మనోహరంబులై.
| 257
|
చ. |
కరిమకరాలయాఢ్యతఁ బ్రకాశగభీరత నచ్యుతస్థితిన్
వరకమలోదయస్ఫురణ వ్రాలుటఁ బన్నగలోకసంగతిన్
ధరఁగల వారికెల్లఁ బ్రమదంబున నాశ్రయమై తనర్చుటన్
బరఁగుఁ బురిం దటాకములు పాలసముద్రముతో సమంబులై.
| 258
|
చరిగొండ ధర్మయ్య – చిత్రభారతము [3-2]
సీ. |
తనసొమ్ములై యున్న ఘనతరపద్మరా
గప్రభాపటలి నల్గడలఁ బర్వఁ
దనజీవనస్థితి మనియెదమని రాజ
హంసమండలము నెయ్యమునఁ గొలువఁ
దననిత్యమధురత్వమునకుఁ దక్కినవారిఁ
జవుక సేయుచుఁ గవీశ్వరులుఁ బొగడఁ
దనకు నీడై సంతతంబును వికసించి
పుండరీకంబులు దండి మెఱయఁ
|
|
తే. |
దన్నుఁ బాయని సిరిఁ జూచి తలఁగ లేక
వేడ్క బ్రమదాళులెల్ల సేవించుచుండ
సరసులకు నెల్ల మేటియై సార్వభౌము
చందమున నుల్లసిల్లె నీ సరసి మెఱసి.
| 259
|
శ్రీనాథుఁడు - శృంగారనైషధము [1-98]
సీ. |
శేషపుచ్ఛచ్ఛాయఁ జెలువారు బిసములు
తన్మగ్నసురదంతిదంతములుగ
నిండార విరిసిన పుండరీకశ్రేణి
యామినీరమణ[2]రేఖాళి గాఁగఁ
బ్రతిబింబితోపాంతబహులపాదపములు
గర్భస్థశైలసంఘంబు గాఁగ
నేకదేశంబున నిందీవరంబులు
[3]కాలకూటమయూఖఖండములుగ
|
|
- ↑ క.ప్రభవ
- ↑ క.రేఖాంకురముగ
- ↑ క.గరళకూట