చ. |
పదములు చారుపద్మములు భాసురకంఠము లొప్పు శంఖముల్
రదములు కుందముల్ కచభరంబులు నీలము లట్లు గాన స
మ్మదమునఁ గాంతలై నిధులు మానుగ నున్నవి యైన నా పురిన్
సుదతుల తుచ్ఛమధ్యములఁ జొచ్చిన లేములు వాయ వెన్నడున్.
| 232
|
కవిలోకబ్రహ్మ - అరుణాచలపురాణము
చ. |
వలుద కుచంబులున్ బవడ వాతెఱలున్ మెఱుఁగారు మేనులున్
బలుచని చెక్కుటద్దములుఁ బద్మపు మోములుఁ గంబుకంఠముల్
కలువలఁ బోలు కన్నులు వికాసపు నవ్వులుఁ జిల్క పల్కులున్
దలిరుల మించు పాదములుఁ దత్పురికాంతల కొప్పు నెంతయున్.
| 233
|
పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత
శా. |
లీలం గాముని నోమఁ బోవునెడ కేళీనందనం బెంతయున్
జాల న్వాసన కెక్కు నొండొరువు లోజం బల్కుచోఁ జిల్కపిం
డోలో నాల్కుల తొక్కుఁ దక్కుఁ జని నీరాడంగ నంభోజినీ
రోలంబంబులు చొక్కు వీటి సతులన్ [రూపింప సామాన్యమే].
| 234
|
పామరభామలు
ఉ. |
కందుకకేళి సల్పెడు ప్రకారమునన్ బురుషాయితక్రియా
తాండవరేఖ సూపెడు విధంబునఁ బామరభామ లేఁత యీ
రెండ ప్రభాతవేళ రచియించె నితంబభరంబుఁ జన్నులున్
గుండలముల్ కురుల్ గదలఁ గోమయపిండము లింటిముంగటన్.
| 235
|
భావన పెమ్మన - అనిరుద్ధచరిత
చ. |
చెలువము లొప్ప రాజనపుఁజేలకుఁ గావలియున్న కాఁపుఁగూ
తుల నిడువాలుఁగన్నులును దోరపుఁజన్నులుఁ జూచి ధైర్యముల్
[1]పలపలనైన మందగతులన్ జనుచుండుదు రంగజాస్త్రముల్
దలముగఁ దాఁక నధ్వగులు తన్నగరాంతికమార్గభూములన్.
| 236
|
చ. |
కలమవనప్రతానములు గాచుటకై చనుదెంచి యింపులన్
జిలికెడు మంజురీతి విలసిల్లఁగ నార్చుచు ముద్దు[2]టల్కలన్
జిలుకలఁ దోలి [3]లేజెమరు చెందఁ గొలంకుల కేఁగి చిల్కలన్
జిలుకల నాడుచుండుదురు చెన్నుగఁ బామరబాలికాజనుల్.
| 237
|
- ↑ క.వలమైన
- ↑ ట.పల్కులన్
- ↑ ట.పై