పణిదపు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము
తే. |
తొలుత ముంగిళ్ళఁ గర్పూరధూళిఁ దుడిచి
సహజచందనజలములఁ జాఁపి చల్లి
చారుగృహములఁ గమ్మ కస్తూరి నలికి
మ్రుగ్గు లిడుదురు పురసతుల్ ముత్తియముల.
| 173
|
చిమ్మపూడి అమరేశ్వరుఁడు - విక్రమసేనము
క. |
హరగిరి సురగిరి రోహణ
గిరు లీనిన కొదమ లనఁగ గృహములు పురి న
చ్చెరువగును గుడ్యరత్న
స్ఫురణను విలసిల్లి తగిన పొడవులతోడన్.
| 174
|
నన్నయభట్టు – ఆదిపర్వము [1-8-72]
చ. |
అలఘుతరంబులై తుహినహారసుధారుచినిందురోచిరా
కులశశికాంతవేదిపృథుకుంజగళజ్జలనిర్ఘరంబులన్
విలసితజాహ్నవీవిమలవీచివిలోల[1]లసత్పతాకలం
బొలుపగుఁ దత్పురీభవనముల్ హిమశైలముఁ బోలి యున్నతిన్.
| 175
|
బ్రాహ్మణులు
పెదపాటి సోమయ్య - అరుణాచలపురాణము
సీ. |
అంగయుక్తంబుగా నామ్నాయములు నాల్గు
చదువంగనేరని సద్ద్విజాతి
[2]బ్రహ్మపద్మాదిపురాణాగమేతిహా
సము లెఱుంగని బ్రహ్మసంభవుండు
భాట్టవైశేషికప్రాభాకరాదిశా
స్త్రము లాఱు చూడని ధరణిసురుఁడు
స్వకులోచితములైన సప్తతంతువు లెల్లఁ
బార మేదింపని బాడబుండు
|
|
తే. |
కావ్యనాటకలసదలంకారముఖ్య
విద్యలన్నియు నెఱుగని విప్రవరుఁడు
పంచయజ్ఞంబులును లేని బ్రాహ్మణుండు
వెదకి చూచినఁ బొడమఁ డా వీటిలోన.
| 176
|
- ↑ సత్వతారకటం
- ↑ ట.బ్రాహ్మపాద్మ