[1]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-7]
శా. |
ఏణీలోచన లాత్మవక్త్రరుచిచే నేణాంకసౌభాగ్య మ
క్షీణప్రౌఢి హరింప సౌధపథసంకీర్ణేంద్రనీలోపల
శ్రేణీనిర్మలకుట్టిమంబులపయిన్ శీతాంశుఁడున్ బెద్దయై
ప్రాణాచారము పడ్డ యట్ల ప్రతిబింబవ్యాప్తిచేతం దగున్.
| 151
|
చ. |
అహరహముం బ్రభాతముల హర్మ్యతలోపరిచంద్రశాలికా
గృహములఁ గామినీసురతకేలివిసూత్రితహారమౌక్తిక
గ్రహణపరాయణంబులగుఁ గావునఁ దన్మతిఁ బ్రాంతతారకా
గ్రహములఁ జంచులం గమిచి కాయుఁ బురిం జిఱుప్రోది పార్శ్వముల్.
| 152
|
మాదయగారి మల్లయ - రాజశేఖరచరిత [1-45]
శా. |
నీడల్పాఱు పసిండిమేడలపయిన్ నీలాలకల్ పుట్టచెం
డాడం దాఁకిన కందుగాని శశియం దంకంబు గాదంచు వా
దాడన్ వచ్చిన యంకకానికిఁ దదీయాశంకవో వీటి పెన్
ప్రోడల్ దోడ్కొనిపోయి చూపుదురు తన్నూత్నక్రియాకేళికల్.
| 153
|
తెనాలి రామలింగయ - హరిలీలావిలాసము
ఉ. |
పున్నమచందమామఁ బొరపుచ్చు సుధారస మొయ్యఁ జిల్కుచున్
సన్నము గాఁగ నూరి ఘనసారమునన్ బ్రతిపాక మిచ్చి మీఁ
ద న్నెఱయంగ [2]నర్కినవిధంబున వెన్నెల గాయ నప్పురిన్
సున్నపుమేడ లభ్రపదచుంబిశిరోగృహరాజి రాజిలన్.
| 154
|
బమ్మెర పోతరాజు – దశమస్కంధము [10-1-1597]
ఉ. |
ఆయతవజ్రనీలమణిహాటకనిర్మితహర్మ్యసౌధవా
తాయనరంధ్రనిర్గత[3]సితాభ్రమహాగరుధూపధూమముల్
తోయదపంక్తులో యనుచుఁ దుంగమహీరుహరమ్యశాఖలన్
జేయుచునుండుఁ దాండవవిశేషము లప్పురిఁ గేకిసంఘముల్.
| 155
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [1-70]
ఉ. |
ఆపురి నున్నతస్ఫటికహర్మ్యవిభాపటలంబు నింగి ను
ద్దీపితమైనఁ జూచి యిది దివ్యతరంగిణి యెత్తి వచ్చెఁ దా
నీ పయిత్రోవ నంచు బయలీఁదుచుఁ గోయఁ దలంతు రగ్రసం
స్థాపితహేమకుంభములు తామరలంచు వియచ్చరాంగనల్.
| 156
|
- ↑ సుంకసాల
- ↑ ట.నల్కిన
- ↑ క.శిలా