చ. |
అలరి యొకింత మాఱుమొగమై యఱచేతుల నొగ్గికొన్న న
చ్చలమునఁ గాముకుండు పయిఁ జల్లెడు నీటిమెఱుంగుదుంపరల్
చెలువ చనుంగవం బొలిచెఁ జేరి తదీయనఖాంకచంద్రులన్
గొలిచి వినూతనద్యుతులు గొల్పెడు తారకపంక్తులో యనన్.
| 96
|
ఉ. |
చేడెలు క్రిందిమెట్టునకుఁ చేతులు పట్టుకు డిగ్గుచుండఁగా
నీడలుఁ దోఁచె నంబువులు నెమ్మిఁ దలిర్పఁగ నాగకన్యకల్
చూడఁగ వచ్చిరో యనఁగఁ జూచెడి పండువ సేసె వేడుకం
దోడుగ వచ్చె నంచలు మనోహరయానము లభ్యసింపుచున్.
| 97
|
చ. |
దుమికిన మీఁదికై యెగయు తుంపర లన్నవతార లుబ్బి త
ద్విమలముఖేందుబింబములు వెన్నెల గాయఁగఁ దత్సరోవరా
బ్జములు [వ]డంకఁజొచ్చె దివసంబు నిశాసమయంబు శంక సే
య ముదముతోడఁ గల్వలు రయంబున గంతులు వైచె నత్తఱిన్.
| 98
|
ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదము [3-196]
చ. |
తన యుదకంబునం దొక సుధాకరబింబముఁ గల్గఁజేసె న
వ్వననిధి యేమి చిత్రమని వారిరుహాకర మంబురాశిఁ గా
దని సితచంద్రబింబముల నప్పుడు గల్గఁగఁ జేసెనో యనన్
వనితల మోము లింపెసఁగె వావిరి గుబ్బలబంటి నీరునన్.
| 99
|
ముక్కు తిమ్మన – పారిజాతము [4-37]
చ. |
పెరిఁగిన హారరత్నముల పెల్లున [1]నొక్కెడఁ దామ్రపర్ణియై
నెరసిన సోగ[2]పెన్నెఱుల నిగ్గున [3]నొక్కెడ భానుకన్యయై
గురుకుచకుంభలిప్తనవకుంకుమ నొక్కెడ శోణయై నభ
శ్చరనది యొప్పె దివ్యజలజాతముఖు ల్జలకేళి సల్పఁగాన్.
| 100
|
చ. |
అలకలు నాసికామణియు నన్నువకౌనుఁ గుచద్వయంబుఁ గుం
డలములుఁ జంచలింప జతనంబున హస్తము లూఁది జీఁకుబం
డల దిగజాఱి రొండొరుకడన్ దరళాక్షులు దోనివింటఁ విం
జలు గొన నేయు పుష్పశరు సంపెఁగవాలికతూఁపులో యనన్.
| 101
|
- ↑ చ.నక్కటి
- ↑ చ.కన్నుగవ
- ↑ చ.నొక్కట