చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [2-73]
చ. |
మనసిజు మంత్రఘోషములు మన్మథు నానతిమాట లిందిరా
తనయ విలాసహాసములు దర్పకు నార్పుటెలుంగు లంగజ
న్ముని చదువుల్ మనోభవు మనోహరగీతు లనంగఁ జారుఖే
లనములు నెల్ల దిక్కులఁ జెలంగె మదోత్కటకోకిలధ్వనుల్.
| 86
|
భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-44]
చ. |
గునియుచు గుజ్జు మావి[1]నెలఁగొమ్మల నిమ్ముల వ్రాలి సోగలై
గొనలు దెమల్చి కెంజిగురు గుంపులు [2]లంపులు మేసి క్రొవ్వి వీ
కున నొగ[3]రెక్కి [4]డగ్గుపడు కుత్తుకలం గడలొత్తు నూతన
స్వనములు పంచమశ్రుతులఁ [5]జట్టికొనం [6]జెరలించెఁ గోయిలల్.
| 87
|
చరిగొండ ధర్మయ – చిత్రభారతము [2-105]
మ. |
ఒగరెక్కం గడులేఁతలై మృదువులై యోగ్యంబు[7]లై యున్న యా
చిగురాకుల్ దమ కంఠదోషముల నుచ్ఛేదింపఁగాఁ జాలు మం
దు[8]గతిన్ మేసి పికంబులెల్లఁ దరుసందోహంబులన్ వ్రాలి [9]సో
లి గరిష్ఠంబగు పంచమస్వరముఁ గ్రోల్చె న్మన్మథప్రీతిగాన్.
| 88
|
పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత
చ. |
పలుకులు బాలికాజనుల భాషలు వీడువడంగఁ జంచులున్
ఫలములు కెంపు పొత్తుఁగొనఁ బక్షములన్ బసరాఁకుఁజొంపముల్
చెలిమి యొనర్ప వర్తనము చిత్తజుఁ డాడియుఁ గూడి రా ++
చిలుకలు వొల్చు తోటల వసించిన పొందులు వేటలాడుచున్.
| 89
|
భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-47]
చ. |
మిలమిల మంచు [మించు] చలిమించుల [10]ముద్దుల చందమామ కాం
తులఁ దులఁదూఁగు క్రొమ్మొలక [11]తూఁడుగొనం గబళించి [12]త్రుంచి వి
చ్చలవిడి మేసి గబ్బుఁగొని సమ్మదనాదము లింపఁ గేలి లీ
లల మలసెం గొలంకుల కెలంకుల రాజమరాళదంపతుల్.
| 90
|
భావన పెమ్మన - అనిరుద్ధచరిత
చ. |
లలితమృణాలముల్ సెలవులన్ రసముట్టఁగ రెండొకంటికిన్
బొలయఁగ నిచ్చుచుం దరఁగ యూయెల లూఁగుచు సైకతస్థలం
బుల విహరింపుచున్ దొగల పొంతల నాడుచుఁ జారులీలలన్
గొలఁకుల నెల్ల భోగములఁ గూడి చరించు మరాళదంపతుల్.
| 91
|
- ↑ చ.శల
- ↑ చ.నావులు
- ↑ చ.లెక్క
- ↑ చ.దన్ను
- ↑ చ.బుట్టి
- ↑ చ.గెరలించె
- ↑ చ.లున్నైన
- ↑ చ.గడున్
- ↑ చ.నోలి
- ↑ చ.మందుల
- ↑ చ.తోడుకలం
- ↑ చ.మించి