చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [2-68]
చ. |
వలి [1]విరవాది క్రొవ్విరుల వాతుల మూతులు వెట్టి తేనియల్
కొలఁదికి మీరఁ గ్రోలికొని క్రొవ్వున [2]జివ్వల నీన నొక్కమై
దలముగ [3]దీటు గట్టుకొని దాఁటెడు తేఁటుల చైది నెల్లచోఁ
గలయఁగ వృక్షవాటికలఁ గ్రమ్మె న[4]కాలతమోనికాయముల్.
| 82
|
భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-46]
చ. |
అరవిరి కమ్మఁ దమ్మి విరు లందుట నెందును సోడుముట్ట న
బ్బురముగ [5]నుబ్బు మేలివలపుల్ [6]పసిఁగొంచు మూఁగిలో
గుఱువులు [7]వాఱి కర్ణికలఁ గొందుల వాచవు లూరు తేనె ము
మ్మరముగఁ [8]గ్రోలి యన్నుకొని మానక ఝమ్మని మ్రోసెఁ దుమ్మెదల్.
| 83
|
చరిగొండ ధర్మయ – చిత్రభారతము [2-107]
తే. |
భూరిమధుపానమునఁ [9]జొక్కి పుష్పరేణు
పటలి భూతిగఁ దాల్చి నేర్పరితనమున
ఝంకృతులు శృంగనాదంబు జాడ గాఁగఁ
దుమ్మెదల పిండు మించె సిద్ధుల విధమున
| 84
|
కోకిలవర్ణన
పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత
సీ. |
భామినీసమితికిఁ బంచమస్వరముల
బాగులు నూచు నేర్పరు లనంగ
విటవీటిజనులకు వినమ్రోసి మన్మథా
వేశంబుఁ గావించు వెజ్జు లనఁగ
విరహిబృందములకుఁ బొరి నుల్కు పుట్టించు
గొఱతెడు మరు వెఱగొంగ లనఁగ
నిల వసంతునికి మిక్కిలి సొంపు గలిగింపఁ
డాలైన యట్టి చుట్టము లనంగ
|
|
తే. |
సొగసి తలిరుల వాచవిఁ జూచి చూచి
పక్వసహకారఫలరస[10]పాయు లగుచు
ధరఁ బురారామపాదపవరులు కాఁపు
లున్న కోకిలదంపతు లుల్లసిల్ల.
| 85
|
- ↑ చ.విరివాటి
- ↑ చ.నివ్వల
- ↑ చ.ధాటు గు
- ↑ చ.కోయ
- ↑ చ.మెరి
- ↑ చ.వడి
- ↑ చ.జారి
- ↑ చ.యెన్న
- ↑ చ.జొచ్చి
- ↑ చ.పాను