పుట:ప్రబంధరత్నాకరము.pdf/227

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[1]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [2-59]

సీ.

జగతీస్థలము పట్టుచాలమి పరికించి
              చాలించు లీల వర్షములు వెలిసెఁ
గైకొన్న నీరెల్ల గ్రక్కింప రవి యాఁక
              విడిచు లీల మొయిళ్ళు వికియఁబాఱె
ప్రావృడ్జనని తోడు వాసిన బిడ్డలై
              పెంపేది నదులు శోషింపఁజొచ్చె
రాజుల దండయాత్రలఁ ద్రొక్కుడగు భీతి
              నిలఁ జొచ్చె నన రొంపు లివురఁబాఱె


ఆ.

జలము కలఁక [2]దేఱె సస్యముల్ పక్వంబు
లగుచు వచ్చెఁ దెల్లనయ్యె దిశలు
ఱెల్లు పూఁచె నంచ లెల్లెడఁ గొలఁకుల
నుల్లసిల్లె శారదోదయమున.

29

[2-60]

సీ.

అంబుదంబులఁ గల్గు నాసారవర్షంబు
              కరిమదంబులయందుఁ గ్రాలుకొనియె
కేకి కేకలఁ గల్గు కాకలీభావంబు
              కలమగోపికల వాగ్గతులఁ జేరెఁ
గేతకీతతిఁ గల్గు కృతవికాసస్ఫూర్తి
              కుందవాటికలపైఁ గుదురుపడియె
సురచాపమునఁ గల్గు [3]పరభాగసంపత్తి
              చేల కేఁగెడు శుకశ్రేణిఁ జెందె


తే.

బకకులంబులు గతి విజృంభణమదంబు
మధురకలహంసకులముల నధివసించె
నఖిలలోకప్రసా[4]దావహముగ వాన
కాల మరుగంగ నవశరత్కాలమైన.

30

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదము [4-43]

ధ్రువకోకిల.

సకలధాన్యసమృద్ధిచేతఁ బ్రసన్నకౌముదిచే సుధో
దకముచే ననుకూలవర్షవితానశీతహిమంబుచే
సెకలు చల్లని లేఁతయెండలచేత వేడుక సేయఁగా
నకట సాటియె కాలముల్ శరదాగమంబున కెయ్యెడన్.

31
  1. సుంకసాల
  2. చ.దీరె
  3. చ.వర
  4. చ.సారమైన