చెదలువాడ - యెర్రాప్రగడ - నృసింహపురాణము [3-111]
సీ. |
వెడవెడ మూతులు విచ్చు తామరలపై
సుడిసి నెత్తావులు సూఱ లాడి
యనుఁగుఁదోఁటులు సొచ్చి యలరుదేనియఁ [1]జేసి
యెలదేఁటి పదువులఁ జెలఁగి నడచి
రాయంచకవల నిద్రలు దెల్పి కొలఁకుల
దరఁగ యుయ్యలయూట దగులు పఱిచి
సోర్ణగండుల సొచ్చి సురతఖేదము నొందు
చెలువులఁ జెలువుర సేద దీర్చి
|
|
తే. |
యడరి గృహపతాకికలకు నాట గఱపి
ప్రోది నెమళుల యెఱకల [2]పొదులు విచ్చి
మందసంచారమున సుకుమార మగుచు
మెఱసెఁ బ్రత్యూషసమయసమీరణంబు.
| 241
|
కవిలోకబ్రహ్మ - అరుణాచలపురాణము
సీ. |
గొజ్జంగివిరులపైఁ గుప్పించి కుప్పించి
కన్నెగేదఁగులపై గంతు గొనుచు
వకుళగుచ్ఛములపై వర్తించి వర్తించి
పున్నాగతతులపైఁ బూన్కి నెఱపి
గురువిందపొదలపైఁ గ్రుమ్మరి క్రుమ్మరి
విరవాదిలతలపై విశ్రమించి
మల్లికావళులపై మసలాడి మసలాడి
సురవన్నెతరులపైఁ బొరలుపెట్టు
|
|
తే. |
ననుదినము నిట్లు పుష్పవాసనలఁ దేలి
యంగజాభంగరతులందు ననఁగి పెనఁగి
యలసి పడియున్న జనముల యలఁత మాన్పు
మలఁగి యప్పురి ప్రాభాతమారుతంబు.
| 242
|
బొడ్డపాటి పేరయ – పద్మినీవల్లభము
ఉ. |
సారసరఃప్రతీరవనసౌరభపుష్పరజోవిభూతి నొ
య్యారపుఁజొక్కు చల్లి మలయానిలుఁడన్ గడిదొంగ వేకువన్
సోరణగండ్లఁ గన్నములఁ జొచ్చుచు దివ్వెలుఁ [3]దూర్చి భోగభా
మారతితాంతఘర్మకణమౌక్తికపంక్తులు దార్చు నిచ్చలున్.
| 243
|
- ↑ క.రేచి, గ.వేంచి
- ↑ గ.రొదలు
- ↑ క.దుల్పి, చ.దూల్పి