పుట:ప్రబంధరత్నాకరము.pdf/211

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీథినాటకము [క్రీడాభిరామము 54]

ఉ.

మంచన వింటివో వినవొ మన్మథుఁ డేకశిలాపురంబునన్
జంచలనేత్రలన్ మగల శయ్యలపై రతికేళి రాత్రి వో
రించి ప్రభాతకాలము పరిస్ఫుటమైనను ధర్మదార వ
ర్జించుచునున్నవాఁ డదె కుటీ[1]గతకుక్కుటకంఠకాహళిన్.

225

చంద్రాస్తమానము

ముక్కు తిమ్మన – పారిజాతము [2-59]

సీ.

చరమాద్రిదావాగ్నిసంప్లుష్టసురసౌర
              భేయీకరీషైకపిండ మనఁగఁ
బహుచకోరకదంశపరిపీతచంద్రికా
              క్షౌద్రనీరసమధుచ్ఛత్ర మనఁగఁ
బ్రత్యఙ్ముఖోచ్చలద్రాత్రివర్షీయసీ
              పలితపాండురకేశబంధ మనఁగ
గగనసౌధాలేపకరకాలశిల్పిని
              ర్ముక్తసుధావస్త్రముష్టి యనఁగ


తే.

సుహిమహితజ్యోత్స్నికాలతాసుమగుళుచ్ఛ
మనఁగ నతిధూసరచ్ఛాయ నబ్జవైరి
చెలువు వోనాడి బింబావశిష్టుఁ డగుచు
నల్లనల్లన వ్రాలెడు నంబుజాక్ష.

226

శ్రీనాథుఁడు - శృంగారనైషధము [8-4]

మ.

వరుణప్రేయసియైన దిక్కుఁ గదియన్ వాంఛించుచున్ జంద్రికా
పరిధానంబుఁ గ్రమక్రమంబునఁ బరిభ్రంశంబు నొందించు చం
దురినిం గన్గొని యింద్రదిగ్వనిత ప్రత్యూషప్రసాదోదయ
స్ఫురణవ్యాజమునన్ నిజాననమునన్ బూనెం బ్రహాసద్యుతిన్.

227

చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [3-108]

ఉ.

రాతిరియెల్లఁ జాల ననురాగముతోడఁ గుముద్వతీరతిన్
భీతి భజించి ఖేదమునఁ బ్రేయసియున్ సొగియంగఁ దాను ను
ద్భూతపరిశ్రమార్తుఁడగు పోలికఁ జంద్రుఁడు పశ్చిమాబ్ధిశ
య్యాతలసుప్తికై డిగె ననల్పవిభావిరళాంగరాగుఁడై.

228
  1. గ.హట