పరిచయము
ఇది పూర్వసంకలనగ్రంథము. గ్రంథనామము ప్రబంధరత్నాకరము. సంకలనగ్రంథకర్త పెదపాటి జగ్గన. పెదపాటి జగన్నాథకవి అని ప్రసిద్ధము. “అరయ రామప్రెగ్గడకులాగ్రణి గంగయమంత్రిజగ్గ” అని సంకలనగ్రంథకర్తను జగన్నాథస్వామి సంబోధించినట్లు స్వప్నవృత్తాంతమునందు కలదు. (1.4) అందువలన “రామాప్రెగ్గడ” ఇంటిపేరని ఒక అభిప్రాయము కలదు. (ఆంధ్రకవితరంగిణి. పదియవ సంపుటము. 1953. పుట 92.) రామప్రెగ్గడ కులాగ్రణి అనగా రామప్రెగ్గడ వంశమునందు శ్రేష్ఠుడని అర్థము. జగ్గన వంశావతారవర్ణనమునందు మూలపురుషుడు రామప్రెగ్గడ అనియు కలదు. (1.9) ఆ వంశావతారవర్ణనమునందే “శ్రీ పెదపాటి పురీబాలగోపాలకృష్ణప్రసాదితశ్రీల వెలసి ........ జగ్గనమంత్రివరుఁడు” అని కలదు. (1.21) పెదపాడులోని బాలగోపాలకృష్ణుని అనుగ్రహము కల జగ్గన పెదపాడు నివాసి అగును. పెదపాడు ఊరిపేరు. ఊరిపేరు ఇంటిపేరగుట సర్వసాధారణము. “పెద్దపాటి జగ్గన్న నామధేయప్రణీతం” బని ఆశ్వాసాంతగద్యలందు కలదు.
ప్రబంధరత్నాకరమునందు పింగళి సూరన, భట్టుమూర్తిప్రభృతుల పద్యములు లేవు కావున జగన్నాథకవి 1550-60 ప్రాంతము వాడని ఒక అభిప్రాయము కలదు. (ఆంధ్రకవితరంగిణి. పదియవ సంపుటము. పుట 96.) కాని తదనంతరుడగు అద్దంకి గంగాధరుని తపతీసంవరణపద్యము కలదు. అంతేకాదు. ప్రబంధరత్నాకరము పూర్తిగా లభింపలేదు. తంజావూరు సరస్వతీమహలు గ్రంథాలయమునందు తాళపత్రగ్రంథము తృతీయాశ్వాసమువఱకు మాత్రమే కలదు. అందు తృతీయాశ్వాసమునందు పెద్ద గ్రంథపాతము కలదు. ఆ పెద్దగ్రంథపాతము, తదుపరి తృతీయాశ్వాసము, చతుర్థాశ్వాసము చాలవఱకు గల ప్రత్యంతరము కలదు. (సాహిత్యసంపద. 1989. పుటలు 256-257) ప్రథమాశ్వాసము నందలి ప్రణాళికనుబట్టి (27వచ.) పంచమాశ్వాసమును ఉండవలయును. ఉపలబ్ధము కాలేదు. ఉపలబ్ధమైన అసమగ్రప్రతియందు పింగళి సూరన, భట్టుమూర్తి ప్రభృతుల పద్యములు లేవని, ప్రబంధరత్నాకరము పదునాఱవశతాబ్ధి గ్రంథమని నిర్ణయించుట ప్రామాదికము.
తంజావూరి ప్రతియందు –
. | నీ వెంత వేడుకొన్నను | 123 |
అను పద్యము కలదు. ఇది నెల్లూరి ముత్తరాజు పద్మావతీకల్యాణములోని పద్యముగ కలదు. ఇందు “దేవుఁడు నహి గురువు న్నహి” అను పలుకుబడి కలదు. పద్మావతీకల్యాణమే అర్వాచీనగ్రంథ మనిపించును. అందలి పద్యమును సంకలించిన ప్రబంధరత్నాకరము అంతకంటె అర్వాచీనగ్రంథమగును.
ప్రత్యంతరమునందు –
సీ. | బొమ్మంచులువ్వంగమలు గజపొప్పళ్ళు | |
తే. | మండలాచరణంబులు నిండు జంత్రి | |