నారాయణదేవుఁడు – మదనకళాభిరామము
[1]సీ. |
క్రొవ్వారు చనుఁగవ నవ్వు మారెడుఁబండ్ల
కడునెఱ్ఱనై యుండు వెడఁద కనులు
తిలపుష్పసౌభాగ్య మలవడు నాసంబు
కలహంస వోలిక గలుగు నడపు
అరవిందకెందమ్మిమర యను మరునిల్లు
కువలయరుచి మించు క్రొత్త మెఱుపు
చెలువంబుఁ గల మేనుఁ జిత్తజజలమును
గమలగంధము గల్గి యమరు సిగ్గు
|
|
తే. |
గలిగి యొప్పెడు గరిగలికలను జెలఁగు
వెల్లఁ జీరలుఁ దెల్లని విరులుఁ గోరు
కుడుపుకొని [2]పేదవిప్రుల గురుల సురల
సరవితోఁ గొల్చుఁ బద్మినీజాతి నాతి.
| 143
|
బాలకు
[3]మ. |
అమితస్వచ్ఛ మచుంబితాధర మపూర్వాసంగవిద్యాసురం
గ మదంతక్షతకంఠ మగ్రహణకక్షాస్థానయుగ్మం బనిం
ద్య మహేయం బవలం బనాంకురితరోమాంచంబు బాలాంగనా
గమసంభోగము నింపు సొంపు విటలోకప్రీతి గాకుండునే.
| 144
|
[4]క. |
వలరాజునకుం గట్టిన
యిలు సంసారంపు సరకు లెక్కించెడి పె
న్గలము సమస్తసుఖంబుల
మొలకసుమీ బాలయైన ముద్దియఁ దలఁపన్.
| 145
|
యౌవన
[5]చ. |
ఎడపక తియ్యవింటి తెగ నెక్కిన బాణము దుఃఖవార్ధికిన్
గడపయి దాఁటరాని సుడిగాలి విరక్తులకెల్ల గుండెత
ల్లడము శరీరలక్ష్మికి విలాసము లోకవికాసమాన పెన్
బొడవుఁ దలంచిచూడఁ బువుబోఁడుల జవ్వన మెవ్విధంబునన్.
| 146
|
- ↑ క.లో లేదు.
- ↑ గ.బేజ
- ↑ క.లో లేదు.
- ↑ క.లో లేదు.
- ↑ క.లో లేదు.