పుట:ప్రబంధరత్నాకరము.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శరమునఁ బొడమిన చక్కని సారథి
              సారథి [1]చేగొన సాగు హరులు
హరుల సామర్థ్యంబు లరసిన శింజిని
              శింజినిఁ దరిత్రాడు సేయు బలము


తే.

పొందువడఁజేసి దైత్యుల పురములేసి
యఖిలజగములు రక్షించు నట్టి జోద
వనుచుఁ గొనియాడుదురు నిన్ను ననుదినంబు
నంగభవభంగ! తిరుకాళహస్తిలింగ!

43


సీ.

దేహంబు మిక్కిలి తిరమైన రథముగా
              ఘననేత్రయుగము చక్రములు గాఁగ
నూర్పు లశ్వంబులై యొప్పారుచుండంగ
              దొరయు పళ్ళెరము సూతుండు గాఁగ
నవ్యాంగమతి శూరసాయకంబది గాఁగ
              సొరిదిఁ గుంతలములు జోడు గాఁగఁ
దలమైన విహరణస్థలము కార్ముకముగా
              నలువైన హారంబు నారి గాఁగఁ


తే.

నన్నియును నీ మహత్త్వంబె యగుటఁజేసి
లీలఁ ద్రిపురంబు లేసి గెల్చితివి గాక
నీకు నొరులు [2]సహాయులై నిలువఁగలరె
నంగభవభంగ! తిరుకాళహస్తిలింగ!

44

కవిలోకబ్రహ్మ - పెదపాటి సోమరాజు - శివజ్ఞానదీపిక

సీ.

కవగూడి నడక సాఁగని బండి[3]కండ్లును
              దొమ్మిది తునుకల తొడుసు తేరు
పెక్కు బ్రాహ్మణుల చేఁజిక్కిన [4]గుఱ్ఱాలు
              చిలుకుల నఱిగిన చివుకు టిరుసు
బహుముఖవిభ్రాంతిఁ బడలిన సారథి
              వినువీథి [5]నుఱిమిన [6]విరుగు విల్లు
పదిబ్రద్దలై [7]యొడ్డు వాసిన బాణంబు
              పొరలెత్తి పోయిన బోలు నారి


తే.

పట్టఁ బసలేదు సాధనప్రకరశక్తి
విషమ[8]లక్ష్యంబు లైనట్టి విమతపురము
లెల్ల సాధించి గెల్చితి వేక[9]హేతి
బాపు! త్రిపురాంతకేశ్వర! భక్తవరద!

45
  1. క. భోగాన, ట. మొగమున
  2. క. సహాయమై
  3. ట. కండులు
  4. ట. గుఱ్ఱమ్ము
  5. ట. నఱమిన
  6. ట. వీఁగు
  7. క. యొద్దు
  8. ట. శబ్దంబు
  9. క. హేలి, ట. హేల?