పుట:ప్రబంధరత్నాకరము.pdf/163

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచతంత్రి

చ.

చెలువుగ దుష్కరంపుఁబని సేసియుఁ జేసితి నాక క్రూరతం
బలుమఱు వ్రేసినం గడవఁబల్కిన నుల్లములోన నొండుగాఁ
దలఁపక పల్కుచొప్పిదము తథ్యముగాఁ దగఁ బల్కి మోసలన్
బిలువక వేచియున్నతఁడు భృత్యుఁడు రాజున కెన్నిభంగులన్.

45

[?]

ఆ.

అన్యదేశమెల్ల నాత్మదేశంబకాఁ
దలఁచువాఁడు నెపుడు తలఁకు లేక
రమణ [1]సేఁత యెల్ల రాజ్యంబు [2]సేఁతగా
దలఁచువాఁడు ప్రియుఁడు ధరణిపునకు.

46

[?]

క.

మానుగఁ బతి పనిచినఁ దన
చే నిది గాదనక వేగఁ జేకొని యనలం
బైనఁ జొరవలయు నంబుధి
యైనను నీఁదంగవలయు నర్థిని భృత్యుల్.

47


క.

బలుకొఱడు వోలె నెండకుఁ
జలికిని వానకును నోర్చి జనపతి నెవ్వం
డలవడఁ గొలుచును వానికి
వలనొప్పఁగ సిరులు దాన వచ్చి వసించున్.

48

లోకనీతి

తిక్కనసోమయాజి ఉద్యోగపర్వము [2-46]

క.

చెలిమియు సంభాషణమును
బలిమి వివాదంబుఁ ద్రోపుఁ బాడియుఁ దమ యం
తలవారితోన తగు నధి
కుల హీనులతోడనైనఁ గొఱ గా దధిపా!

49

[2-80]

క.

వగ బలము దఱుఁగు రూపఱు
వగచినమతి దప్పుఁ దెవులు వచ్చును దూఱన్
వగచి నలంగినఁ బ్రియమగుఁ
బగతుఱకును వగచు టుడుగు పార్థివముఖ్యా!

50
  1. క.శాంత
  2. క.శాంత