బాలక్రీడ
మాదయగారి మల్లయ రాజశేఖరచరిత [2-3]
ఉ. |
నిద్దపురత్నభిత్తిఁ దననీడను గన్గొని తోడనాడు నా
ముద్దులబాలుఁ డంచుఁ గరముల్ పలుమాఱును [1]జాఁచి చీరుచున్
విద్దెము సేయుచుండి తగు విందులు విందులు వచ్చిరంచు నే
ప్రొద్దు నృపాలుఁడున్ సతియుఁ బొంగుచు నక్కున గారవింపఁగన్.
| 213
|
శా. |
కేలీకాంచనసౌధవీథికల చక్కిం దొట్లలోఁ బెట్టి యా
ప్రాలేయాచలకన్యకాధవకృపాపారంగతా! నిద్రవో
వే! లావణ్యపయోనిధీ! యనుచు నావిర్భూతమోదంబునన్
జోలల్ వాడుదు రక్కుమారునకున్ శుద్ధాంతకాంతామణుల్.
| 214
|
తే. |
కఱకుఁజూపుల మూడవక న్ననంగ
రత్నములు గీలుకొలిపిన రావిరేక
ఫాలభాగంబుపైఁ గ్రాల బాలుఁ డపుడు
శంబరారాతి యభియాతి చంద మొంద.
| 215
|
శైశవము
[2]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [1-55]
సీ. |
కనుఱెప్ప లిడ నెఱుంగని చూడ్కిఁ జూచుచు
జిగివీఁపు దోఁప బోరగిలఁబడుచుఁ
గరజానువులఁ జతుశ్చరణుఁడై తిరుగుచు
శిశునిదర్శితదృఢస్నేహుఁ డగుచు
భాసురమితపదన్యాసంబు సూపుచు
హ్రదవిహారమున దుర్వారుఁ డగుచు
జనకజానందబీజత్వంబుఁ గైకొంచు
గుణముల ముసలి నాఁ బ్రణుతి గనుచు
|
|
తే. |
వసననిరపేక్ష నిచ్ఛాప్రవర్తి యగుచు
హయసమారోహణంబు సేయంగఁగలిగి
రాసుతుఁడు దనశైశవక్రమదశావ
తారములచేతఁ బూరుషోత్తమతఁ దెలిపె.
| 216
|
- ↑ క.జూపి
- ↑ సుంకె