ముక్కు తిమ్మయ్య – పారిజాతము [3-14]
ఉ. |
కాళియభేదిఁ జూచు తమకంబున మజ్జనమాడి యాడి నీ
లాలక యోర్తు గంధసలిలార్ద్రకచంబులు చన్నుదోయిపై
[1]రాలిచి సందిటం బొదివి రాజపథంబున కేఁగుదెంచె గో
పాలకమూర్తిఁ గాన [2]శిఖిబర్హము కానుక దెచ్చెనో యనన్.
| 67
|
[3]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-157]
ఉ. |
అంబుజనేత్ర యోర్తు వసుధాధిపు గన్గొనుచో రసాతిరే
కంబునఁజేత మున్ను తమకంబునఁ దెచ్చిన దర్పణంబులో
బింబితమైన రాజు ప్రతిబింబము చెక్కున నొక్కి గ్రక్కునన్
జుంబన మాచరించి చెలిఁ జూచి ముఖాబ్జము వంచెఁ గ్రక్కునన్.
| 68
|
అన్యోన్యవీక్షణలు
తిక్కన సోమయాజి – విజయసేనము
సీ. |
మదనవశీ[4]కరమంత్రదేవత దృష్టి
గోచరమూర్తిఁ గైకొనియెనొక్కొ
సితకరబింబనస్సృతసుధాధార ని
తంబినీరూపంబుఁ దాల్చెనొక్కొ
విధికామిని[5]సృష్టి విజ్ఞానపరసీమ
భాసురతనులీలఁ బడసెనొక్కొ
శృంగారనవరసశ్రీవిలాసోన్నతి
సుందరాకారంబు నొందెనెక్కొ
|
|
ఆ. |
కాక యొకవధూటి కడుపునఁ బుట్టిన
భామ కేల యిట్టి రామణీయ
కంబు గలుగు ననుచుఁ గన్నియపై మహీ
పాలసుతుఁడు దృష్టి పరవె నర్థి.
| 69
|
క. |
కిసలయకదళీబిసబిం
బసుధాంశుప్రాయవస్తుబహువిధరూపో
ల్లసము ముద ముడుప నజుఁ డొక
యసమాకృతిఁ [6]దాల్చె నొ[క్కొ] యంగన గాఁగన్.
| 70
|
- ↑ గ.వ్రాలిన
- ↑ క.శశి
- ↑ సుంకసాల
- ↑ చ.కార
- ↑ క.శ్రేష్ఠ
- ↑ చ.దార్చె ననఁగ నంగన యొప్పెన్