పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/82

ఈ పుట ఆమోదించబడ్డది

80

ప్రపంచ చరిత్ర


భావించుచున్నారు. మన ప్రపంచ పరిస్థితు లిట్లు తలక్రిందుగా తయారైనవి. ఆహారమును పండించుచున్నప్పటికిని రైతు బీదస్థితిలో నున్నాడన్న ఆశ్చర్యమేమి ? ప్రపంచభాగ్యమునకు కారకుడై కర్మాగారములలో పనిచేయు కార్మికుడు బీదస్థితిలో నున్నాడన్న ఆశ్చర్యమేమి? మనదేశమునకు స్వాతంత్ర్యము కావలెనని మనము కోరుచున్నాము. ఈ తలక్రిందు పరిస్థితులను చక్కజేయ లేనప్పుడు, కార్మికునకు అతని కష్టమునకు ఫలము దక్కనప్పుడు ఎందు కీస్వాతంత్ర్వము? రాజనీతిశాస్త్రమును గూర్చియు, పరిపాలనా కళనుగూర్చియు, ఆర్థికశాస్త్రమునుగూర్చియు, దేశభాగ్యమెట్లు విభజించవలెనో యన్న విషయమునుగూర్చియు పెద్ద పెద్ద పుస్తకములు వ్రాయబడినవి. చదువుకొన్న పండితు లీవిషయములమీద ఉపన్యాసము లిత్తురు. ప్రసంగములు, చర్చలు జరుగుచునేయున్నవి. కాని కార్మికులు బాధపడుచున్నారు. 200 సంవత్సరములకు పూర్వము వాల్టేరు అను ప్రసిద్ధ ఫ్రెంచి గ్రంథకర్త రాజకీయవేత్తలు మున్నగువారిని గూర్చి ఈ విధముగా అన్నాడు - "పొలమును దున్నుచు, ఇతరులకు బ్రతుకు తెరుపు కల్పించువారిని ఆకలిచే చచ్చునట్లు చేయు కళ వారు తమ చక్కని రాజకీయములలో కనిపెట్టినారు."

ప్రాచీనమానవు డింకను ముందుకు సాగిపోయి క్రమముగా ప్రకృతి నాక్రమించెను. వనములను నరికివేసెను, ఇండ్లను కట్టెను. భూమిని దున్నెను. కొంతవరకు మానవుడు ప్రకృతిని వశపరచుకొన్నట్లే చెప్పుదురు. ప్రకృతిని వశపరచుకొనుట యనుమాట జనులు వాడుదురు. ఇది అనాలోచితమగు మాట. నిజముకాదు. ప్రకృతిని మానవుడు అర్థము చేసికొన మొదలు పెట్టినాడు ఆనుట ఇంతకన్న మంచిది. ఎంత బాగుగా అర్ధము చేసికొనునో అంత చక్కగా అతడు దానికి సహకారము చేసి తన యవసరములకు దానిని వినియోగించుకొన గలుగుచున్నాడు. వెనుకటిరోజులలో ప్రకృతిని చూచినను, ప్రకృతిలో గోచరమగు కార్యములను చూచినను మనుష్యులు భయపడువారు. వాటిని అర్థము చేసికొని గ్రహించు