పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/66

ఈ పుట ఆమోదించబడ్డది

64

ప్రపంచ చరిత్ర


పంచాయతీగృహమునకు బదులు ఒక పెద్దచెట్టు ఉండును. ప్రతి సంవత్సరము గ్రామములోని స్వతంత్రు లందరును చేరి తమ పంచాయతీ నెన్నుకొందురు.

పండితులు పలువురు పట్టణములకు, పల్లెలకు సమీపమందున్న అడవులకు, శాంతముగా జీవితమును గడపుటకో, ఆధ్యయనాదులు జరుపు కొనుటకో పోయెడివారు. వారిని ఆశ్రయించుటకు శిష్యులు వచ్చి చేరుచుండెడివారు. ఇట్లు క్రమముగా క్రొత్త వలసలు ఉపాధ్యాయులతోను, శిష్యులతోను తయారగుచుండెను. ఈ వలసలు విశ్వవిద్యాలయములని మనము భావించవచ్చును. అచ్చట చక్కని భవనము లనేకములు లేవు గాని జ్ఞానార్జనకై దూరప్రాంతములనుండి ఆ విద్యాస్థానమునకు పలువురు వచ్చుచుండిరి.

ఆనందభవనము [1]కెదురుగా భారద్వాజాశ్రమ మున్నది. నీ కది బాగుగా తెలియును. రామాయణకాలమున భరద్వాజుడు ఋషి యనియు, వనవాసకాలమున శ్రీరామచంద్రు డాతనిని దర్శించెననియు నీకు తెలిసియే యుండవచ్చును. అతని ఆశ్రమమున వేలకొలది విద్యార్థు లుండెడివారని చెప్పుదురు. భరద్వాజుడు ప్రధానాచార్యుడుగా నది యొక పెద్ద విశ్వవిద్యాలయమై యుండవలెను. ఆ రోజులలో ఆశ్రమము గంగాతీరమున నుండెను. ఇప్పుడు గంగ ఒక మైలు దూరముగా పోయినది. మనతోట భూమి కొన్నిచోట్ల ఇసుకమయము. ఆ దినములలో నిది గంగ పారు ప్రదేశ మై యుండవచ్చును.

హిందూదేశమున నున్న ఆర్యులకా తొలిదినములు ఉచ్చకాలమై యుండెను. ఈ కాలమునకు మన దురదృష్టవశమున, చరిత్ర లేదు. మనకు తెలిసిన విషయము లన్నియు చరిత్రకాని గ్రంథములనుండి గ్రహించినవే. ఆ కాలమ నాటి రాజ్యములు, ప్రజాప్రభుత్వరాజ్యములు

  1. అలహాబాదులో నెహ్రూ కాపురముండు ఇల్లు.