పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/259

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయినను దమలక్షణగ్రంథముల చెప్పకవ్యాదులు పద్యము నుదాహరింప మానినంతనే పూర్వగ్రంథముల గూర్చి యనుమానము పడుట కూడునా! మరుద్రాజచరిత్ర, పండితారాధ్యచరిత్ర, శాలివాహనసప్తశతి, పల్నాటివీరచరిత్ర యనుగ్రంథములనుండి మాత్రము వా రుదాహరణముల గైకొనిరా? ఆమాత్రముచేత నవి శ్రీనాథునివి కావనుచున్నామా? భోజరాజీయము, విజ్ఞానేశ్వరీయము, మార్కండేయపురాణము, ప్రభోధచంద్రోదయము, కువలయాశ్వచరిత్రము, భానుమతీపరిణయము మొదలగు నెన్నిగ్రంథములనుండి యప్పకవి మొదలగువారు పద్యము లుదాహరించుట మానలేదు? లాక్షణికులు తమ కవసరమైన లక్ష్యముల బూర్వప్రబంధము లన్నింటినుండియు దీసికొనవలయునా?

శైలి శ్రీనాథుని శైలితో నెంతమాత్రమును బోలదట! శ్రీనాథుని యేశైలితో బోలదు? వీథినాటకమందలి శైలితోడనా? శృంగారనైషధమందలి శైలితోడనా, హరవిలాసము నందలి శైలితోడనా? ఒక్కకవియే వేరువేరుప్రాయము లప్పుడు వ్రాసినయెడల గవిత్వమునకు వేరువేరు శైలులు వచ్చును. కవిబ్రహ్మయనుపేరు తనకు వచ్చుటకు దగినట్టుగా భారతభాగము నాంధ్రీకరించిన తిక్కయజ్వ సోమయాజి కాకపూర్వము రచించిన నిర్వచనోత్తరరామాయణమును జూచిన, నది యాతనిదా యనుపించును. కవిరాజమనోరంజనము పిల్లవసుచరిత్ర మని పేరు వడునంత ప్రౌఢముగా రచియించిన కనుపర్తి సుబ్బన్న చిన్నతనమునందు వ్రాసిన యనిరుద్ధచరిత్రమును జూచిన, నది యాతినిదా యనుపించును. చామకూర మంచిపాకమునఁ బడినదని మెప్పుడు గాంచునట్లు విజయవిలాసమును విరచించిన వెంకటకవి యంతకు బూర్వము చేసిన సారంగధరచరిత్ర చూచిన, నది యాతనిదా యనుపించును. ఈసంగతులను మనస్సునం దుంచుకొని యుండినచో విమర్శకులు సైలి పోలదని వ్రాసియుండరు. రసికాభిలాషము శృంగారనైషధాదులవలె సంస్కృతభూయిష్టము కాదు గాని కొంతవరకు వీథినాటకకవిత్వమును బోలుచున్నదనవచ్చును. వీథినాటకము వ్రాసినవయస్సునకును భిన్నమైన ప్రాయమున వ్రాయబడి యుండినచో వీధినాటకసైలికంటెఁ గూడ దీనిశైలి భిన్నమై యుండవచ్చును. శ్రీనాథుని గడుసుఁదనపుఁబోకడ లిందెక్కడ గానరావట! శ్రీనాథుని గడుసుఁదనపుబోకడల కేమిగాని నైషధాదులయందున్న గడుసుఁదనపుఁబోకడలేవో రసికాభిలాషమునందు లేనిచో దృష్టాంశములతోఁ జూపి, తమవాదము హేతువులతో సిద్ధాంతీకరించికొనక వట్టిమాటలమాత్రముచేత గాలక్షేపము చేసిన యీవిమర్శకుల గడుసుఁదనపుఁబోకడనుమాత్ర మెంతైనను మెచ్చవచ్చును. ఆలాగుననే కల్పన లెక్కడోకాని తరుచుగాఁ బ్రౌఢముగా లేవని వీరు మాటమాత్రముచేతనే స్థాపింపజూచుచున్నారు! కాదన్నవాఁడు కరణ మన్నట్లు వ్రాసిన