పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/202

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

చేతను బుస్తకంబులను జేకొని మెల్లగఁ బాఠశాలకై
యో తరళాక్షి, నీ వరుగుచున్నెడ, మన్మథబాధచేత నా
చేతము వ్రీలుచుండ, నినుఁ జీమయుఁ గుట్టినయట్లు కాదయో
భూతదయాగుణం బెదను బుట్టని నీచదు వేలఁ జెప్పుమా?

39


చ.

నెలఁత, కొళాయి కీ వరిగి నీళ్ళను బట్టుచు నిల్చియుండఁగా,
బొళబొళ మంచు గొట్టమున బుట్టిననీళులు నీదుబిందెలో
పలఁ బడినట్టిరీతి నుతిపాత్రమవౌ నిను జూచి నామన
స్థలిని ద్రవించుకోరికలు ధారను గట్టి స్రవించె నీపయిన్.

40


ఉ.

బోటిరొ, మొన్న నాటకము చూచుటకై చనుదెంచి, యచ్చటన్
బోటులలోల నిన్నుఁ గని బుద్ధిమరల్పఁగ లేనివాఁడనై,
నాటక మేమియో యెఱుఁగ, నాయకి వీ వగు చిత్రనాటకం
బాటగ మన్మథుండు ననువాఁడగ జేసెను సూత్రధారుఁ డై.

41


ఉ.

సంబర మీవు చూచుటకు చక్కనివేషముతోడ బండిలో
నం బయికాస్యమించుగ కనంబడునట్లుగ వంగియున్నచోఁ
శంబర నేత్ర నేత్రములు నాపుగ విప్పుచు నిన్నుఁ జూచుటే
సంబరమయ్యె నాకు, పయిసంబర మతయు వ్యర్థమే సుమీ.

42


శా.

బొట్లం జెప్పఁగ భూషితాంగి నగుచుం బువ్విల్తు పట్టపుటే
న్గట్టి వేగుచునుండ, దీపపువెలుగందున్ నినున్ గాంచి, చీఁ
కట్లన్ నీమెరు?గారునవ్వులె తొలంగంజేసెనో లేక గా
స్లైట్లే మూలకుఁ ద్రోసెనో, యెరుఁగ కాశ్చర్యంబు కంటిం జెలీ.

43


ఉ.

బందుగులింటిపెండ్లికయి బాలరొ నీవును నేనుఁ బోయి యం
దరుం బెండ్లిసందడులయందు మునింగి మెలంగఁగా, నదే
సందడియంచు నుంటి మదిజ్ఞాపక మున్నదొ లేదొ! నాఁటి యా
నందము నిన్ను నేఁ గలిసినంగద క్రమ్మరఁ గల్గగావలెన్.

44