పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/199

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

చక్రసామ్యంబు నీ జఘనప్రదేశ మొ
            క్కటికె కా, దింక రెండిటికిఁ గలదు
దాడిమీజయము నీ దంతవితాన మొ
            క్కటికె కా, దింక రెండింటికిఁ గలదు
కరులతో వాదు నీగమనవిలాస మొ
            క్కటికె కా, దింక రెండింటికిఁ గలదు,
బింబరూపము నీ పెదవి చక్కఁదన మొ
            క్కటికె కా, దింక రెండింటికిఁ గలదు


గీ.

తరుణి, సంఖ్యచే రెండని ద్వైతముగను
చెప్పుటే గాని, సరిగ చర్చించి చూచు
వారి కెల్ల నభేదభావంబు తోఁచు
చుంట నద్వైతముగఁ జెప్పు టుచితమేమొ.

23


శా.

నాణెం బౌ రతనాలదుద్దులును, సొన్నాటంకపుం బేరు వి
న్నాణంబౌ పుదుచేరిచేఁత జిగినీ నానున్ సువర్ణంపు టొ
డ్డాణంబున్, రకమైన నాగరము మేల్వంకీలునున్ కంకణాల్
రాణింపన్ మరురాణివాస మన నారాణీ, విరాజిల్లవే.

24


ఉ.

కామిని, పచ్చపట్టురవికన్ బిగి గల్గ ధరించి, మేలి బా
లామణిచీరఁ దాలిచి, తళ త్తళ లాడెడి దుద్దు లాదిగా
హేమవిభీషణప్రతతు లెన్నియొ మేనున బూని నట్టి నీ
గోము తలంచుచున్ మఱపు గొందుఁగదే యితరప్రపంచమున్.

25


శా.

జాకెట్టున్ జలతారుచీరయును భూషల్ దాల్చి, దోషాకరున్
చేకొట్టం గలమోముతో వెలయు నీ చెల్వంబు వీక్షించినన్
వాకట్టౌఁ గద యెట్టివారికిని, చెల్వా విల్వకే యిత్తువో,
తాకట్టుంతువొ? నీమనంబు వశ మొందంజేయుమా నాఁకికన్.

26