పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/189

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్రొమ్ముడిని పూవుటెత్తులఁ గూర్చు వలపు
గులుక నీలాద్రిభూపాలమలహరుండు.

158


క.

ఇ ల్లెఱుఁగక ప ట్టెఱుఁగక
యెల్లధనము దాని కిచ్చి యెగ్గును సిగ్గున్‌
జెల్లఁగఁ దత్పాదద్వయ
పల్లవముల దండ మురిసి పడి కా పుండెన్‌.

159


తే.

పుడమిపై గూదలంజెకు బుడ్డవేడ్క
కాఁడ ననెడుమాట చంద్రరేఖకును నీల
ధరణివరునకుఁ జెల్లెను దత్కథావి
ధాన మెఱిఁగించితిని నీకుఁ దథ్యముగను.

160


తే.

అనుచుఁ దంబళ వీరభద్రార్యమణికి
నంబి నరసింహుఁ డతులితానందహృదయ
కమలుఁ డై చెప్పి యంతట సముచితగతి
నతని వీడ్కొని చనె దేవతార్చనకును.

161


క.

వాచాగోచరముగ భువి
నాచంద్రార్కంబు గాఁగ హాస్యరసముచే
నా చంద్రరేఖ కథయును
నీ చరితముఁ జెప్పినాఁడ నీలనృపాలా.

162


క.

ఈ కృతికి సమముగాఁ గృతి
నే కవులునుఁ జెప్పఁజాల రిది బిరుదము భూ
లోకము రాజులలోపల
నీకు దొరకె హాస్యలీల నీలనృపాలా.

163


చ.

ధరణియు మేఘమార్గమున దారలుఁ దామరసాప్తచంద్రది
క్కరటిగిరీంద్రశేషఫణికంధికిటీశ్వరకూర్మనాయకుల్‌
స్థిరముగ నెంతకాలము వసింతురు తత్క్రియ నీ ప్రబంధ ము
ర్వర సరసోత్తముల్‌ కవులు వర్ణన సేయఁగ నుండుఁ గావుతన్‌.

164