పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/113

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావు నీలాద్రిమాధవరాయరాజశిఖామణిచే కవిసార్వభౌమబిరుద మంది సుప్రసిద్ధకీర్తి గాంచిన తిమ్మకవి యీతని కగ్రజుం డగుటవలన నవిభక్తకుటుంబగౌరవమున జగ్గకవికి వివాహ మాయె ననియు, ననంతరము జగ్గకవి మనుగుడుపుల కేఁగియున్నపు డతని ప్రవర్తనమును జూచి పరమశుంఠ యగు నల్లుఁడు దొరికినందులకు జగ్గకవిమామగా రనుతాపబడి తన మిత్త్రులతో “నా తొమ్మండ్రు కూఁతులను గుక్కలను జంపుకొని తిను కొయ్యలకే యిచ్చితిని” అని యనెననియు, నందుపై జగ్గకవి మామగారి మాటలకు రోషము తెచ్చుకొని దేశాంతర్గతుండై మంగళగిరి కరిగి వేంకటాచార్యులను సుప్రసిద్ధపండితునియొద్దం జేరి యాతని నాశ్రయించి విద్యాభ్యాస మొనర్చి పది పండ్రెండేండ్లలలోఁ బండితుండై యనర్గళముగా కవిత్వము చెప్పనారంభించెనని పుక్కిటపురాణముగాఁ జెప్పికొందురే గాని కేవల మిక్కధ కల్పితమని తోఁపకమానదు. ఈకథయే నిక్కమగుచో జగ్గకవి కవిత్వము చెప్పనారంభించునప్పటికి ముప్పది రెండు సంవత్సరముల ప్రాయమై యుండవలెనుగదా! కూచిమంచి తిమ్మకవి తాను ముప్పదిసంవత్సరముల వయస్సుననే రచింప నారంభించిన “సింహాచలమహాత్యము”నఁ దన పెద్దతమ్ముఁడైన సింగన్నను వర్ణించిన తరువాత రెండవతమ్ముఁడైన యీ జగ్గకవినిగూర్చి యిట్లు వ్రాసియుండెను.

క. అతని యనుజన్ముఁ డతులిత
       మతియుతుఁడు, సమస్తరాజమాన్యుఁడు, సుగుణా
       న్వితుఁడు, సమంచితకవితా
       చతురుఁడు, జగ్గప్రధాని చంద్రుఁడు తనరున్.
క. భోటకలాటకిరాటవ
       రాటమరాటాంగవంగరాజన్యసభా
       ఝాటనిరాఘాటనట
       చ్చాటుకవిత్వాంకుఁ డరయ జగ్గన ధరణిన్.
సీ. నిరతంబు నుడి వోని సిరి నిర వొందియుఁ
                         దవుటినిప్పటి మెక్కఁ దలఁపఁ డేని