పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/6

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ఏడెన్​ను మినహీయించి మిగిలిన అరేబియా అంతాకూడా స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డానికి మిత్ర మండలివారు అంగీకరిస్తే మేము మీ పక్షానచేరి విప్లవం కొనసాగిస్తాము" అని సర్ హెన్రీ ఉత్తరానికి హుస్సేన్ ప్రత్యుత్తరాల్ని వ్రాశాడు. దానికి ఒప్పుదలకాకుండా సర్ హెన్రీ బేరానికి దిగాడు. కొన్ని రోజులపాటు ఈ బేరం సాగిన తర్వాత బసరా—బాగ్డాడ్ ప్రాంతం బ్రిటిష్​వారి అధికారం క్రిందనూ, అలెప్పొ బైరూత్ జిల్లాలు ఫ్రెంచివారి అధికారం క్రిందనూ తాత్కాలికంగా ఉండవచ్చునని హుస్సేన్ అంగీకరించాడు. ఆ తర్వాత 1915 అక్టోబర్ 24వ తేదీని బ్రిటిష్ ప్రభుత్వం వారి తరఫున సర్ హెన్రీ "మక్కా షెరీఫ్ సూచించిన సరిహద్దులలోని అరబ్ రాజ్యాల స్వాతంత్య్రాన్ని అంగీకరించడానికీ, దాన్ని (ఆ స్వాతంత్య్రాన్ని) స్థాపించడంలో తోడ్పడ్డానికీ వాగ్దానం చేస్తున్నాము," అని తెలియబరిచాడు.

అరబ్బుల సహాయం అవసరం కావడం వల్ల, బ్రిటిష్​వారు అరేబియానూ—దానిలో ఒక భాగమైన పాలస్తీనానూ—ఈ విధంగా అరబ్బు జాతివారికి వాగ్దానం చేశారు. కాని, అరబ్బుల సహాయం అవసరమైనట్టే, వారికి యూదీయుల తోడ్పాటు కూడా కావలసివచ్చింది. అంచేత వారు అరబ్బులకు ఇచ్చి వేస్తామన్న పాలస్తీనానే యూదీయులకు కూడా వాగ్దత్తం చేశారు.

4

స్వదేశ భ్రష్టులైన యూదీయులు పశ్చిమాభిముఖులై యూరప్​లోని వివిధ దేశాలకు వలస వెళ్ళి, అక్కడ నివాసమేర్పరచుకున్నారు. కాని ఒక చోటనైనా వారికి శాంతి, భద్రతలు చిక్కలేదు. అన్యజాతీయులు, అన్య దేశస్థులు, అన్య మతం వారు అనేక కారణాల చేత ప్రతి చోటనూ వారిని అనుమానంగా చూడ్డమే!

"ఏసుక్రీస్తును సిలువ వేసినవారు" అని యూదీయులకు ఒకకళంకం ఉంది. దీన్ని సాకుచేసుకుని, ప్రతి దేశంలోనూ క్రైస్తవ మతగురువులు వారి మీద ప్రజా విద్వేషాన్ని రగుల్కొల్పేవారు. ఇంతే కాదు. యూదీయుల ప్రజ్ఞావిశేషాలే వారికి ఒక లోపంగా పరిణమించాయని కూడా చెప్పవచ్చు. తమ అపార మేధా శక్తి వల్ల వారు ఏ భాషనైనా సులభంగా అభ్యసించగలరు; ఏ వృత్తిలోనైనా తేలికగా చాకచక్యాన్ని సంపాయించగలరు. అంచేత ఎంతటి హైన్యస్థితిలో—ఎంతటి పరదేశానికి వెళ్ళినా—వారు ఇట్టే పైకి రాగలరు. ఇది స్థానిక ప్రజల అసూయను రేకెత్తించడం సహజం.

ఈ అన్ని కారణాల వల్ల ప్రతిదేశంలోనూ యూదీయుల్ని హింసించడం, ప్రతి చోట నుంచీ వారిని తరిమి కొట్టడం సంభవించింది; సంభవిస్తున్నది.

ఇంగ్లండు నుంచి వారిని 1290 లోనూ, ఫ్రాన్సు నుంచి 1394లోనూ, స్పెయిన్ నుంచి 1492లోనూ, పోర్చుగల్ నుంచి 1497లోనూ, నేపుల్సు నుంచి 1540లోనూ, వియన్నా నుంచి 1670లోనూ, బొహిమియా నుంచి 1745 లోనూ తరిమివేశారు. యూరప్ పశ్చిమ భాగంలోని ఒక్కొక్క దేశంలో నుంచి ఇలా తరిమి వెయ్యగా, యూదీయులు యూరప్ తూర్పు