3
టర్కీ నిరుంకుశ పరిపాలన క్రింద పాలస్తీనాతోపాటు తక్కిన అరేబియా అంతా కూడా అతి హైన్యస్థితిని అనుభవించవలసి వచ్చింది. దాన్ని భరించలేక అరబ్బు జాతి నాయకులు విప్లవ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు 1910 తర్వాతగాని ఒక రూపానికి రాలేదు.
1911 లోనో, 12లోనో మెసపటోమియాకు స్వాతంత్య్రాన్ని సంపాయించాలని బాగ్డాడ్లోని ఇరాక్ సైనికోద్యోగులు ఒక రహస్య సంఘాన్ని స్థాపించారు. సిరియా స్వాతంత్య్రం కోసం డమాస్కస్‌లో ఇంకొక రహస్య సంఘం ఏర్పడింది. మక్కా గ్రాండ్ షెరీఫ్ అయిన హుస్సేన్ -ఇతడు మహమ్మద్ ప్రవక్త వంశీయుడు- అరేబియానంతటినీ తన ఆధిపత్యం క్రింద స్వతంత్ర రాజ్యంగా చెయ్యాలని కలలు కనసాగాడు. నెజ్డ్ ఎడారులలో ఇబిన్ సాద్ తలయెత్తి, వాహబీ స్వాతంత్య్రోద్యమానికి నాయకుడయ్యాడు. మొత్తం మీద అరబ్బు జాతి అంతా కూడా టర్కీ దాస్యశృంఖలాల నుంచి తప్పించుకోవాలని తహతహలాడ సాగింది.
సరిగా ఈ సమయంలో ఐరోపా మహాసంగ్రామం (1914) ప్రారంభమైంది. ఈ మహా సంగ్రామంలో టర్కీ జర్మనీ పక్షాన్ని వహించింది. ఇది అరబ్బులకు చక్కని అవకాశంగా కనబడింది.
బ్రిటన్, ఫ్రాన్సు మొదలైన మిత్రమండలి రాజ్యాల పక్షాన చేరి, వాటి సహాయంతో విప్లవాన్ని ప్రకటించి, టర్కీదాస్యాన్ని వదుల్చుకుంటే, స్వరాజ్యాన్ని సంపాయించుకుంటే, ఈ ఆశ, ఈ కల అరబ్ జాతినంతటినీ ఆయుధ ధారణకు పురికొల్పింది.
అరబ్బుల దాస్య బాధను-వారి స్వరాజ్యాకాంక్షను-స్వప్రయోజనానికి వినియోగంచుకోవాలని మిత్రమండలి రాజ్యాల వారు మొదటి నుంచీ అనుకుంటూనే ఉన్నారు. అరబ్బులందరి చేత తిరుగుబాటు చేయిస్తే అది టర్కీ సామ్రాజ్యం వెన్నున పొడిచినట్టవుతుంది. ఇంతటి సదవకాశాన్ని చేయిజారిపోనివ్వడమే!
టర్కీ సూయజ్ కాల్వకు సమీపంలో ఉన్న రాజ్యం. అది ఆ కాల్వ మీద దండెత్తితే, దాన్ని జయిస్తే, బ్రిటన్ - ఫ్రాన్సుల ఆటకట్టినట్టే![1] అంచేత ఎంత త్వరగా టర్కీని దెబ్బకొడితే, అంత మేలు.
ఈ ఆలోచనతో బ్రిటిషువారు ఈజిప్టులో తమ హైకమిషనర్‌గా ఉంటున్న సర్ హెన్రీ మాక్-మహొన్ను అరబ్బు జాతీయ నాయకులతో రహస్య రాయబారాల్ని సాగించవలసిందిగ ఆజ్ఞాపించారు. ఈ ఆజ్ఞ ప్రకారం అతడు మక్కాలోని షెరీఫ్ హుస్సేన్‌తో ఉత్తర ప్రత్యుత్తరాల్ని నడిపాడు.
- ↑ 1914-1916 సంవత్సరాల మధ్య టర్కీ సేనలు రెండు సార్లు సూయజ్ కాల్వ మీద దండెత్తినాయి.