చరిత్రలోనూ ప్రసిద్ధికెక్కిన హెరాడ్ దేవాలయం ఈ నగరంలోనే ఉండేది. ఇప్పుడు ఆ దేవాలయం అంతటికీ మిగిలింది ఒక జీర్ణకుడ్యం[1]. దీన్ని "వెయిలింగ్ వాల్" అంటారు. పర్వదినాలలో యూదీయులు ఇక్కడచేరి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. "శిథిలమైపోయిన మా రాణ్మందిరం కోసం మేము ఏకాంతంగా కూర్చుని విలపిస్తున్నాము; వినాశనం చేయబడ్డ మా దేవ మందిరం కోసం మేము ఏకాంతంగా కూర్చుని విలపిస్తున్నాము; విలిప్తమైన మా ప్రతిభ కోసం, గతించిన మా మహా పురుషుల కోసం, భస్మీపటలమైన మా భాగ్యరాసులకోసం, మేము ఏకాంతంగా కూర్చుని విలపిస్తున్నాము" - ఇదే వారి ప్రార్ధనల సారాంశం. ఈ విధంగా వారు అక్కడ విలపిస్తూ ఉంటారు గనుకనే ఆ జీర్ణకుడ్యానికి "వెయిలింగ్ వాల్" (విలాపకుడ్యం) అనే పేరు వచ్చింది.
"వెయిలింగ్ వాల్" మాత్రమే కాకుండా "జియాన్" పర్వతం కూడా జెరుసులం నగరంలోనే ఉన్నది. ఈ పర్వతం కూడా యూదీయుల దృష్టిలో చాలా పవిత్రమైంది.
ఇక, క్రైస్తవులకు పాలస్తీనాలో ప్రతి అంగుళం కూడా పూజనీయమైనట్టిదే. వారి మత సంస్థాపకుడైన ఏసుక్రీస్తు పుట్టిందీ, పెరిగిందీ, తన సందేశాన్ని చాటిందీ, చివరికి సిలువ మీద ఆత్మార్పణం చేసిందీ పాలస్తీనాలోనే. ఆయన జీవితంతో సంబంధం ఉన్న ప్రతి ప్రదేశమూ క్రైస్తవులకు ఒక మహాపుణ్యక్షేత్రం. వీటిలో జెరుసులం నగరానిది అగ్రస్థానం.
పోతే, మహమ్మదీయుల దృష్టిలో కూడా జెరుసులం పెద్ద పుణ్యక్షేత్రమే! మక్కా, మదీనాల తర్వాత జెరుసులంకు వీరు ప్రాధాన్యతను ఇస్తారు.
ఉనికిని బట్టీ, వివిధ మతాలతో ఉన్న సంబంధాన్ని బట్టీ పాలస్తీనాకు ఏర్పడ్డ ఈ అధిక ప్రాముఖ్యత వల్లనే ప్రాచీనకాలం నుంచీ కూడా అది అనేక సంఘర్షణలకు... అనేక యుద్ధాలకు... కేంద్రమైంది.
ఈజిప్షియనులు, పర్షియనులు, యవనులు, అరబ్బులు, టర్కులు మొదలైనవారు అనేకులు వివిధ సమయాలలో పాలస్తీనా పైకి దండెత్తి వెళ్ళారు; దాన్ని జయించి పరిపాలించారు. ప్రస్తుత సమస్యను తెలుసుకోడానికి ఈ ప్రాచీన చరిత్ర అనవసరం. కాని, రెండు మూడు ముఖ్యమైన తేదీలను మాత్రం గుర్తుంచుకోవలసి ఉంటుంది. అవి ఇవి:
క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జెరుసలుమును ధ్వంసం చెయ్యడం, అక్కడ నుంచి యూదుజాతి వారిని వెళ్ళగొట్టడం జరిగింది.
1516లో టర్కీ పాలస్తీనాను జయించుకుంది. అప్పటి నుంచి 1917 వరకు పాలస్తీనా టర్కీ పరిపాలనలోనే ఉంది.
- ↑ మొండి గోడ