పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/3

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ విషయాన్ని బ్రిటిష్ కలోనియల్ మంత్రి మాల్కాం మాక్డోనాల్డ్ కూడా ఇటీవల అంగీకరించక తప్పిందికాదు. కామన్సు సభలో 1938 నవంబర్ 24వ తేదీనాడు పాలస్తీనా సమస్యను గురించి ఉపన్యసిస్తూ ఇతడు "పాలస్తీనా అరబ్ ఉద్యమంలో పాల్గొంటున్నవారిలో చాలా మంది దేశాభిమాన ప్రేరితులైన వారని చెప్పక తప్పదు. వారి దేశాభిమానం వక్రమార్గాల్ని పట్టిన పట్టి ఉండవచ్చునుగాని, అసలు వారి దేశాభిమానాన్ని మాత్రం శంకించడానికి వీలులేదు." అని అన్నాడు. ఇక పాలస్తీనా అరబ్బులు చేస్తున్నది స్వాతంత్య్ర సమరం కాదని ఎవరనగలరు?

అన్నట్టు, కొందరు పాలస్తీనాలో అరబ్బులకూ యూదలకూ జరుగుతున్న సంఘర్షణను బట్టి పాలస్తీనా సమస్య కేవలం "అరబ్బు - యూదు" సమస్య అని భావించడం కద్దు. భారత దేశ సమస్య కేవలం "హిందూ - మహమ్మదీయ" సమస్య అని భ్రమించడం ఎలా ఉంటుందో, ఇది కూడా సరిగా అంతే!

2

పాలస్తీనా చాల చిన్న దేశం. దాని వైశాల్యం సుమారు 900 చదరపు మైళ్ళు మాత్రమే! కాని దానికి ప్రాచీన చరిత్రలోనేమి, ప్రస్తుత కాలంలో నేమి విశేష ప్రాముఖ్యత ఉన్నది. ఇందుకు మొదటి కారణం, - దాని ఉనికి.

పాలస్తీనా మూడు ఖండాలకు—ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలకు—మధ్యస్థంలో ఉన్నది. అంచేత ప్రపంచపు రహదార్లకు అది పెద్ద జంక్షన్ అయింది. పూర్వకాలంలో ప్రపంచం ఎగుమతి దిగుమతులు పాలస్తీనా పడమటి దిక్కులో ఉన్న రహదారిపైగానే నడుస్తూ ఉండేవి. వర్తక వ్యాపారాలకు మాత్రమే కాకుండా, ఆనాటి జైత్ర యాత్రలకు కూడా ఆ మార్గమే ఉపకరించేది, అస్సీరియన్, పర్షియన్, బాబిలోనియన్, యూరపియన్ సైన్యాలు ఈజుప్టుపై దండెత్తి వెళ్లిందీ, ఈజిప్టు వాటిని తరిమి కొట్టిందీ ఆ మార్గం వెంటనే.

పాలస్తీనా తూర్పు దిక్కులో కూడా ఇలాంటి రహదారే ఉండేది. ఇది దక్షినాన గాజా దగ్గర బయల్దేరి, జోర్డాన్ ఎడారికి తూర్పుగా సిరియాలోకి వెళ్ళి, అక్కడి నుంచి మెసపొటోమియా అస్సీరియా, ఆర్మీనియా ఆసియామైనర్ మొదలైన ప్రాంతాలను చేరుకునేది. ఈజిప్టు నుంచి అరేబియాకు వెళ్ళే రోడ్డు కూడా గాజా మీదుగానే పోయేది.

ప్రాచీనకాలంలో పాలస్తీనా ఇన్ని రోడ్లకు జంక్షన్ అయితే, ప్రస్తుతం ఇది అంతకు మించిన వైమానిక మార్గాలకు జంక్షన్. యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాల మధ్య ప్రయాణం చేసే విమానాలు ఇక్కడనే మజిలీ చేస్తున్నాయి.

ఇక, పాలస్తీనా ప్రాధాన్యానికి రెండో కారణం,- దానిలో ఉన్న పుణ్యక్షేత్రాలు. యూదీయులకు, క్రైస్తవులకు, మహమ్మదీయులకు - వీరందరికి కూడా అది పవిత్ర భూమి.

యూదుజాతికీ, దాని మతానికీ, దాని విజ్ఞానానికీ పాలస్తీనా జన్మస్థానం. హిందువులకు వారణాసివలెనే, యూదీయులకు జెరుసులం అతి పవిత్ర క్షేత్రం. వారి మతంలోనూ, వారి