"మరి ఎక్కడా కూడా మాకు కాలూనడానికి వీలు లేకుండా పోతూఉండడం వల్ల, భూమి అంటే మాకు ప్రేమ ఏర్పడింది. ఇక ముందు వ్యవసాయమే వృత్తిగా మేము పెట్టుకోదలచుకున్నాము" అని యూదులు అంటున్నారు. అంచేత వారికి ఎంత మేరకు వీలైతే అంతవరకు సారవంతమైన భూమిని కట్టబెట్టవలసిందే! [1]పండినపంట ఎగుమతికి, బయట నుంచి రావలసిన సరకుల దిగుమతికి రోడ్లు, రహదార్లు అవసరంగదా?
ఇక, ఆరబ్బులు ఎడారిలోనే పుట్టి, ఎడారిలోనే పెరిగినవారు. అంచేత వారికి ఎడారి ఇవ్వడం న్యాయం. హాయిగా వారు ఎడారి ఇసుకను భోజనం చెయ్యవచ్చును; సినాయినది నీళ్ళను తాగవచ్చును. బ్రిటన్ వాటాల్ని వెయ్యడంలో అన్యాయం చేసిందని ఆరబ్బులు అంటారా? అంత అన్యాయం జరిగిందని అంటూ ఉంటే బ్రిటన్ 20 లక్షల పౌనుల్ని పారవేస్తుంది. పుచ్చుకోనివ్వండి!
పీల్ కమిషన్ వారి సిఫార్శులు ఇవే! ఆరబ్బులు తాము వీటిని ఏ పరిస్థితిలోనూ అంగీకరించమన్నారు. వారు అంగీకరించకపోయినా, బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం అంగీకరించి, విడగొట్టవలసిన మూడు భాగాలకు సరిహద్దుల్ని నిర్ణయించి రమ్మని 1938 జనవరిలో ఉడ్ హెడ్ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ సభ్యులు అక్టోబర్ నెల వరకు ఆలోచించి వారిలో వారికి ఏకాభిప్రాయం కుదరక, మూడు రకాల విభాగాల్ని సూచించారు.
ఈ లోపుగా బ్రిటన్కు "పాలస్తీనాను విభజించడం ఆచరణ సాధ్యంకాని కార్యం" అని పూర్తిగా అవగతమైంది.
17
ప్రస్తుతం పాలస్తీనాలో బ్రిటిష్ ఇంపీరియలిజంకూ, ఆరబ్బు జాతీయతకూ జరుగుతున్న సంఘర్షణ కారణంగా 1938 అంతానికి దాదాపు మూడు వేలమంది ఆరబ్బులు హతులైనారు; గాయపడిన వారి సంఖ్య కూడ ఇంతో, ఇంతకుమించో ఉంటుందిగాని, తక్కువ మాత్రం కాదు. ఇక అరెస్టులకు అంతులేదు. ఆరబ్ జాతీయ నాయకులలో ప్రముఖులందరు చెరసాలలలోనో, ప్రవాసంలోనో ఉన్నారు. ఎన్నో గ్రామాలు నేలమట్టమైపోయినాయి. స్థిరచరాస్తులకు కలిగిననష్టం ఇంతింతకాదు. సోదాలు, జప్తులు, దోపుడులు నిత్యకృత్యాలు.
బ్రిటన్ అవలంబించిన దమన నీతి వల్ల కలిగిన ఈ భయంకర ఫలితాన్ని చూచి, సభ్యతా ప్రపంచం అసహ్యించుతుంది. ఇక, మహమ్మదీయ సంఘంలో—ముఖ్యంగా వివిధ దేశాలలో ఉన్న ఆరబ్బులలో[2]—కలిగిన కలవరం ఇంతింత కాదు. యూదీయుల పక్షాన్ని చేరి బ్రిటన్ తమ మతస్థుల్ని క్రూరంగా హింసిస్తున్నదని మహమ్మదీయులందరు ఆవేశాన్ని పొందారు.