పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పౌనుల కంట్రాక్టులలో అధికభాగం బ్రిటీష్ కంపెనీలకూ, ఇంకా ఇతర విదేశపు కంపెనీలకూ దక్కినాయి. (మిట్చెల్ అండ్ రోలిన్ అండ్ కంపెనీ లిమిటెడ్; మేజర్ కే అండ్ కంపెనీ; జె.యల్. మాడ్ అండ్ కంపెనీ మొదలైన వాటికి).

"ఇక, రైల్వేలలోనూ, హార్బర్లలోనూ, కస్టమ్సు ఆఫీసులలోనూ, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసులలోనూ ఆరబ్బుల పదవుల్ని యూదీయులు ఆక్రమించుకోడాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పనఖ్ఖరలేదు". బ్రిటీష్ వారు పాలస్తీనాలో చేసిన ధర్మపరిపాలన ఇదే!

11

యూదు జాతి వారిపట్ల బ్రిటన్ ఇంత పక్షపాతాన్ని వహించడానికి కారణం,- నిరాశ్రయంగా వున్న ఆ జాతివారికి ఒక ఆశ్రయాన్ని కల్పించుదామనే సచ్చింతకాదు; కేవలం స్వార్థచింత. యూదీయుల పట్ల బ్రిటన్​కు నిజంగా సానుభూతి ఉంటే వారిని వలస పంపించడానికి కెనడా లేదా? ఆస్ట్రేలియా లేదా? దక్షిణాఫ్రికా లేదా? ఒక్క ఆస్ట్రేలియాలోనే ప్రపంచంలోని యూదు జాతి వారందరు వలస వెళ్ళడానికి తగిన సదుపాయంగా ఉండగా, ఇంతకు పూర్వమే జన సంకీర్ణంగా వున్న పాలస్తీనాలోనే వారికి తావు చూపించాలనే పట్టుదల దేనికి?

పాలస్తీనాలో సగటున చదురపు మైలుకు 143 మంది చొప్పున ఇప్పటికే ఉన్నారు. 1918-1919 సంవత్సరాల మధ్య దాని జనసంఖ్య 6,80,000 నుంచి 14,15,000 వరకు హెచ్చింది. ఆరబ్బుల సంఖ్య నూటికి 77 వంతులు పెరిగింది. ఒక, యూదీయుల సంఖ్య నూటికి 703 వంతులు పెరిగింది. ఇకముందు యూదీయుల వలసను పూర్తిగా ఆపివేసినా, మరి పాతిక సంవత్సరాలకు ఇప్పటి జనాభాయే సంతానోత్పత్తి వల్ల ఇరవై లక్షలకో పెరుగుతుంది. అప్పుడు సగటున చదరపు మైలుకు షుమారు 200 మంది ఉండవలసి వస్తుంది. ఇంత ఒత్తిడిని పాలస్తీనా భరించలేదు. అది అసలే చిన్నదేశం. దాని భూవైశాల్యంలో మూడో వంతు మాత్రమే సేవ్య యోగ్యమైంది. ఇక, సహజ సంపత్తి కూడా విశేషంగా లేదు. అంచేత అక్కడికి యూదుల్ని వలసకు పంపించడం-పైగా, మితం లేకుండా పంపించడం-తగనిపని.

ఈ తగనిపనికి బ్రిటన్ పూనుకోడానికి అమేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనట్టివి ఇవి.

ఆరబ్బులకూ, బ్రిటీష్ వారికీ మత విషయంలో నేమి, విజ్ఞాన విషయంలో నేమి, ఆచార వ్యవహారాల విషయాంలో నేమి, రాజకీయల విషయంలో నేమీ-దేనిలోనూ లేశమైనా ఐక్యత లేదు. అంచేత, బ్రిటన్ ఈసారి ఏదైనా యూద్ధంలోకి దిగితే, పాలస్తీనా ఆరబ్బులు దాని పక్షాన ఉంటారనే ఆశకు అవకాశం తక్కువ, తమ సరిహద్దులలో ఉన్న స్వమతస్థులతో-వీరు బ్రిటన్​కు ప్రతికూలంగా యుద్ధ రంగంలో నిలిచేపక్షాన-పాలస్తీనా ఆరబ్బులు ముప్పాతిక మూడు వీసాలు చేరవచ్చును. అంచేత బ్రిటీష్ సామ్రాజ్య రక్షణకు ప్రాణప్రదమైన పాలస్తీనాలోని ఆరబ్బుల్ని తొక్కిపట్టి ఉంచాలంటే, వారిపైన అవసరమైనప్పుడు ఉసిగొల్పడానికి ఏదైనా కొత్త సంఘాన్ని సృష్టించాలి. యూదు జాతివారు ఈ పనికి చాలా చక్కగా పనికివస్తారు.