చెల్లించుకుంటుందనీ, తమకు స్వాతంత్య్రం లభిస్తుందనీ ఆశపడుతూ, వారు విప్లవాన్ని సాగించారు. టర్కీ వారు స్వమతస్థులు. మహమ్మదీయులకు స్వమతస్థులంటే ఎంత పక్షపాతమో అందరికీ తెలిసిన విషయమే! అయితే, ఇక్కడ స్వమతస్థల పక్షం వహించడమంటే, తమ దాస్య శృంఖలాల్ని తామే మరింత బిగించుకోవడమన్న మాట! ఇక, అన్యమతస్థులైన బ్రిటీష్ వారితో చేరితే, స్వాతంత్య్రం లభిస్తుంది. స్వమతస్థుల పట్ల పక్షపాతమా! లేక, స్వాతంత్య్రం పట్ల పక్షపాతమా? ఆరబ్బుల స్వాతంత్య్ర కాంక్షే నెగ్గింది; వారు టర్కీ మీద తిరగబడ్డారు.
ఆరబ్బుల తిరుగుబాటును అణచివెయ్యడానికి టర్కీ మదీనాకు సేనల్ని పంపించింది. ఈ సేనలు మక్కాలోని పుణ్యస్థలాల మీద ఫిరంగుల్ని కాల్చాయి. టర్కీ చేసిన ఈ తెలివి తక్కువ పనివల్ల, ఆరబ్ జాతివారిలో పరిపూర్ణమైన సంఘీభావం ఏర్పడింది. హుస్సేన్ మూడో కుమారుడైన ఫైజల్ నాయకత్వం క్రింద—ఇంగ్లీషు యువకుడైన టి.ఇ. లారెన్సు తోడ్పాటుతో—వారు హెడ్ జాజ్ గుండా దండెత్తివెళ్ళి, సినాయ్గల్ఫ్ వరకు ఆక్రమించు కున్నారు.
ఈ లోపుగా బ్రిటీష్ సేనాని ఆలెంబీ ప్రభువు ఈజిప్టు నుంచి పాలస్తీనా పైకి దండయాత్ర ప్రారంభించాడు. ముందు పాలస్తీనాను ఆక్రమించుకొని, ఆ తర్వాత సిరియా గుండా టర్కీ పైకి దండెత్తాలని అతడి ఉద్దేశం. ఆలెంబీ పాలస్తీనాను జయించుకుపోతూ ఉంటే, మదీనాలో వున్న టర్కీ సైన్యాలు అతడిని ఎదుర్కొనకుండా ఆరబ్బులు (ఫైజల్ అనుచరులు) కాపాడారు. మదీనా నుంచి టర్కీ దళాలు రైలులో (పిలిగ్రిమ్స్ రైల్వే) వస్తూవుంటే, ఆరబ్బులు ఆ రైలు పట్టాల్ని మందుగుండుతో పేల్చివేస్తూ ఉండేవారు. తన కుడివైపు నుంచి టర్కీవారు ఎదుర్కుంటారనే భయం ఈ విధంగా తొలిగిపోగా, ఆలెంబీ అతి సులభంగా పాలస్తీనాలోని వివిధ ప్రాంతాల్ని జయించుకుంటూ, జెరుసులం సమీపించాడు.
ఈ సమయానికి "సైక్స్-పికాట్ ఒడంబదడిక" జరిగినట్టు ఆరబ్బులకు చూచాయగా తెలిసింది. అయితే, వారు దాన్ని నమ్మలేదు. "సర్ హెన్రీ మాక్–మోహన్ ద్వారా మనకు స్వాతంత్య్రాన్ని వాగ్దానం చేసిన బ్రిటన్ ఇంత ద్రోహాన్ని చెయ్యడం అసంభవం" అని వారు అనుకున్నారు. "ఆలెంబీ విజయానికి మనం చేసిన అపారసేవను చూచిన తర్వాత కూడా బ్రిటన్ కృతజ్ఞత చూపుతుందా?" అని వారు మనస్సును సమాధానపరుచుకున్నారు. బ్రిటన్ వాగ్దానం మీద, దాని ధర్మబుద్ధి మీద ఇంత విశ్వాసాన్ని పెట్టుకున్న ఆరబ్బుల మీద సోవియట్ ప్రభుత్వం చేసిన ప్రకటన పిడుగులా పడింది.
రష్యాలో 1917 నవంబర్లో బోల్షివిక్ విప్లవం జరిగి సోవియట్ ప్రభుత్వం ఏర్పడగానే, ఆ ప్రభుత్వం వారు "రష్యా ఇక ఐరోపా మాసంగ్రామంలో పాల్గొనదు," అని ప్రకటించారు. ఇంటితో ఆగక, మిత్రమండలి రాజ్యాల కపటాన్ని బయట పెట్టడానికి వారు యుద్ధ సమయంలోనూ, అంతకు పూర్వమూ పరస్పరంగా చేసుకున్న రహస్యపు ఒడంబడికల్ని కూడా లోకానికి వెల్లడి చేశారు. వీటిలో ఒకటి,- "సైక్స్-పికాట్ ఒడంబడిక".