పుట:పాంచాలీపరిణయము (కాకమాని మూర్తి).pdf/45

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

పాంచాలీపరిణయము


డవును విదురునిఁ బంపి పాండవుల నిటకు
సరగఁ బిలిపింపుఁడని పల్కె సంజయుండు.


క.

దుర్యోధనుం డపు డిట్లను, దుర్యోచన లింతయేల దుష్టాత్మకులన్
గార్యము గాదిటఁ జేర్చుట, మర్యాదుల్ సాదు లెట్లు మఱి దాయాదుల్.


క.

దాయో బోయో యనఁగా, మాయోపాయోద్ధతులు కుమార్గులు హితమే
ధాయుక్తులబలె నుందురు, దాయాదులు వేళవచ్చుదాఁక సహిష్ణుల్.


క.

కుడిచినయింటికి రెండె, ప్పుడు దలఁతు రనంగవలదు భూతల మెఱుఁగున్
గుడి నుండియె గుడిత్రాళ్ళె, క్కుడుగాఁ గోయుట సగోత్రగుణములు సుమ్మీ.


క.

ఏయెడమది నెరపరికం, బైయుండినఁ గార్య మొప్ప దమరించుటకున్
డాయుచు రోయుచుఁ జేసిన, నాయంబగు సఖ్యభోజనంబులు ధాత్రిన్.


క.

దాయాదులు మాయాసము, దాయాదులు వచనమధురతామిష సకలా
దాయాదులు కలహామం, దాయాదులు ధరణి యెఱుఁగదా యాదుడుకుల్.


గీ.

అయిన నేమాయె నేమాయనైన నేమి, యంత లేదండ్రు గాకొక్కచెంత నంచు
విదురుఁ దోడ్కొంచురమ్మన్న వేగ నతఁడు, ద్రుపదపురిఁ జేరి పాండుపుత్రులను గాంచి.


మ.

ధృతరాష్ట్రుండు సుయోధనుండు మిముఁ దోడ్తెమ్మంచు మమ్మంపి రీ
గతిఁ బాంచాలునియింట బాములఁ బడన్ గర్తవ్యమా నేఁడు మీ
పితృరాజ్యంబు సగంబు గొమ్మని సమర్పించంగ నూహించి రీ
రతివేగంబున రండటంచు విరురుం డాడన్ మహెత్సాహులై.


ఉ.

పెట్టెలు పెట్టుఁడి క్కరటిబృందముమీఁదను బట్టుటెక్కెముల్
గట్టుఁడు యోధయూథములకున్ జగముస్తెయి దేర్పరింపుఁ డా
రట్టతురంగధట్టముల రాజుల కెల్లను బల్లకట్టుఁ డి
ప్పట్టణమందె రాణువకు బత్తెము వేయుఁ డటంచుఁ బల్కుచున్.


ఉ.

పైనము లైరి పాండునరపాలతనూజులు యజ్ఞసేన భూ
జానియనుజ్ఞ నశ్వములు సాఁగె రథప్రకరంబు వెళ్ళె మ
స్తేనుఁగుతండముల్ గదలె నేగె భటచ్ఛటబోనపుట్టికల్
మైనపుఁజీరపెట్టియలు మంకెనగిత్తలు గాంచె నెన్నడల్.


గీ.

పడుచు నంపునున్న పలుకు చేఁజెవి గ్రాఁగె, గుండెపగిలె దిగులు నిండె మిగులఁ
గలఁగె డెంద మేఱుగాఁ బాఱె కన్నీరు, కన్నతల్లి నెనరు గాననయ్యె.


గీ.

ఇల్లటంపుమాట కేపాటివాఁడైన, లేఁతరాచబిడ్డ లేకపోయె
రాజయో స్వయంవరం బేల చాటించె, వెలఁది పెండ్లి కేమి వేగిరంబు.