పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/288

ఈ పుట ఆమోదించబడ్డది

256

పద్మపురాణము


ఆ.

ద్వాదశిని రమేశుఁ దగుభక్తి నెప్పుడుఁ
బూజసేయునట్టి పుణ్యమతుల
సప్తజన్మదోషసంచయం బంతయు
నణఁగుఁ దత్క్షణంబ యంబుజాక్షి!

143


తే.

రాజసూయశతంబుఁ దురంగమేధ
యాగశతకంబుఁ జేసినయట్టి ఫలము
నొక్కహరివాసరమునందు నుపవసించు
ఫలము పదియు నాఱవపాలి పాటికాదు.

144


వ.

అట్లు గావున సితాసితపక్షంబుల నుపవసింపని మూఢాత్ములకు విష్ణు
లోకంబు దూరంబగు; నేకాదశియందు భుక్తంబు సేయుమన్న
వానికి మహాపాపం బనఁ దద్భోక్తలకు నెంతపాపం బని చెప్ప
వచ్చు నట్లు గావున నఖిలవర్ణంబులజనంబులకును స్త్రీజనంబులకు
నేకాదశీవ్రతం బవశ్యకర్తవ్యంబు.

145


ఆ.

ఎనయ నేరికైన నేకాదశీతిథి
మిగిలి తల్లి తండ్రి మృతదినంబు
వచ్చెనేని నాఁడు వలవదా ద్వాదశిఁ
జేయు టర్హమండ్రు శిష్టజనులు.

146


వ.

అట్లు కానినాఁడు దేవతలునుం బితరులును నేకాదశిని హవ్య
కవ్యంబు లొల్లరు గావున నేకాదశి నుపవాసం బుంట పరమ
ధర్మంబు.

147


సీ.

దశమి [1]కలయకుండఁ దనరు నేకాదశి
నుపవసింపవలయు నుదయవేళ
దశమి కలిగెనేని ద్వాదశియందైన
[2]నుపవసించుటయును నుత్తమంబు.

148
  1. గలుగకుండ (హై)
  2. నుపవసింపు టదియె యుత్తమంబు (హై)