పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/194

ఈ పుట ఆమోదించబడ్డది

162

పద్మపురాణము

సారస వానరుల పూర్వజన్మ కథనము :

క.

అనవుడు విహగం బగచరుఁ
గనుఁగొని వినవయ్య తొంటికథ నాపుణ్యం
బున జాతిస్మరణత్వము
[1]నను నీ గతి నెఱుకగలిగె నగచరనాథా!

111


వ.

అత్తెఱంగు వివరించెదఁ జిత్తగింపుము.

112


సీ.

పూర్వజన్మంబునఁ బర్వతేశ్వరనామ
         విఖ్యాతివాఁడవు వింధ్యపతివి
యేను నీకులపురోహితుఁడ నుత్తమకుల
         జాతుండ బహువేదశాస్త్రవిదుఁడ
నటుగాన నీజన్మ మంతయు నెఱుఁగుదు
         ధరణి యేలుచు నత్యుదగ్రవృత్తి
ధనలోభమునఁ జేసి దయమాలి భూప్రజఁ
         బీడించి యెంతయుఁ బేర్చి నీవు


ఆ.

తత్పురాకృతోరుతాపానలంబుచేఁ
గులముతోడఁ గూడి పొలిసిపోయి
యమునికింకరులకు నగ్గమై బహువిధ
ఘోరబాధ నట్లు గుందికుంది.

113


వ.

యాతనాశరీరంబు నొంది కుంభీపాకంబునం బడి యప్పటప్పటికి
దగ్ధం బగుచుం బుట్టుచు ఘోరాక్రందనంబు సేయుచు ముప్పది
వేలేండ్లు దుఃఖం బనుభవించి వెలువడియుం దొల్లి యొక్కవిప్రు
నారామంబున బదరీఫలంబులు బలాత్కారంబునం గొనుటం జేసి
యివ్విధంబున వానరంబ వైతివని చెప్పి.

114
  1. దనరిన గతి నెఱుకగలిగె తరుచరనాథా (హై)