పుట:పంచతంత్రి (భానుకవి).pdf/84

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యివ్వనంబున కేతెంచి, తిప్పు డీతఁ
డెవ్వఁ డెఱిగింపుమనఁ, గాక మిట్టులనియె.

41


క.

అనఘా! వినుము హిరణ్యకుఁ
డను మత్తేభ[ముఖ]వాహనాన్వయముఖ్యుం
డనుపమమతి, నమరగురుం
డనఁబరగును నఖిలగుణసమంచితుఁ డరయన్.

42


వ.

అని చిత్రగ్రీవోపాఖ్యానం బతని కెఱింగించి యితండు పరమోప
కారి యగుట దెలిసి సకౌతుకంబుగ మిత్రత్వం బొనరించితి నన, నా కచ్ఛపేం
ద్రుండు విస్మితహృదయుండై హిరణ్యకుం గనుగొని,—

43


క.

అనఘా! విజనారణ్యం
బున కరుదెంచినవిధమ్ముఁ బొలుపొందఁగ నే
వినవలతుఁ జెప్పవే యని
తను నడిగినఁ జెప్పఁదొడఁగెఁ దన్మూషికమున్.

44


వ.

మున్ను మహిళారూప్యంబను పురసమీపంబునఁ జూడాకర్ణుం
డను భిక్షుకుండు మఠస్థుండై యుండు నతనిం జూచు వేడుక [బృహస్వి]
నామధేయుండగు భిక్షుకుండు సేరవచ్చిన నతని నెదుర్కొని యభ్యా
గతపూజలం బరితృప్తునిఁ జేసి, యతం డానతిచ్చు హరికథలు విను
సమయంబున, నాచూడాకర్ణుండు భిక్షమ్ము దెచ్చుకొని భుజియించి శ్లేషిం
చిన యన్నం బొకపాత్రను సంఘటించి తత్సమీపమ్మున మనుచుకొనియున్న
సమయంబున నేను నామఠమ్ము బిలంబులో నివాసమ్ముఁ జేసికొని
యుండి బహుపదార్థసంగ్రహుండ [నయ్యును], లోభంబున క్షుత్పిపాసా
పరవశుండనై బిలంబు వెళ్లి వచ్చి తచ్ఛేషాన్నంబు భుజియించుచుండఁ
జూడాకర్ణుండు నన్నుం గనుగొని కథ వినుట మాని యొకవంశదండంబున
న న్నడిచిన నే నది తప్పించుక బిలమ్ము లోపలికిం బోయితి, నాసమ
యంబున.

45


సీ.

మూషికమ్మును గొట్టె మూర్ఖు చూడాకర్ణుఁ
                    డని బృహస్వియుఁ గోపమడరఁ జూచి